Share News

శుభకార్యాలకు బ్రేక్‌!

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:01 AM

ఎండాకాలం వచ్చిందంటే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పట్టణాలు, పల్లెలు కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంటుంది.

శుభకార్యాలకు బ్రేక్‌!

ఏప్రిల్‌ 29నుంచి ఆగస్టు 8వరకు మూఢాలు, ఆషాఢం

ఈ కాలంలో ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు

అప్పటివరకు పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలకు సెలవు

చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్‌ సేల్స్‌

రంగారెడ్డి అర్బన్‌/యాచారం, ఏప్రిల్‌ 29 : ఎండాకాలం వచ్చిందంటే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పట్టణాలు, పల్లెలు కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంటుంది. ఎండాకాలంలో విద్యా సంస్థలకు సెలవులు.. కొంతమంది ఉద్యోగస్తులు ప్రత్యేక సెలవులు తీసుకుని శుభకార్యాలకు వెళుతుంటారు. ఈ కాలంలో ఫంక్షన్‌హాల్స్‌ మొత్తం బిజీగా మారిపోతాయి. అలాంటిది సోమవారం నుంచి మూడు నెలల వరకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు. ఈ నెల 29 నుంచి ఆగస్లు 8వరకు మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు. దీనివల్ల వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదని తెలియజేస్తున్నారు. వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జూలై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుంది. గురు, శుక్ర మూఢాల్లో నూతన శుభకార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇక జూలై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు.

తగ్గనున్న వ్యాపారాలు

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్‌ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్‌లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించనున్నాయి. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులకు ఆశించిన గిరాకీ లేక ఉసూరుమనే పరిస్థితి నెలకొంది.

మూడు నెలల వరకు మాకు పనిలేదు

మూడు నెలల వరకు మాకు పనిలేదు. మూఢాలు ఉన్నాయి. ఆగస్టు ఆరు నుంచి తిరిగి మంచి రోజులు రానున్నాయి. ఈ మూడు నెలలు తద్దినాలు, వంటి అశుభ కార్యాలు చేసుకోవాల్సిందే. దేవాలయ వార్షికోత్సవాలు వంటివి చేసుకోవాలి.

శ్రీపాదచారి, చేవెళ్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి,

మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావు

మూడు నెలల వరకు మంచి రోజులు లేవు. శుభకార్యాలు ఏమీ జరగవు. మూడు నెలలు పంక్షన్‌హాల్‌ ఖాళీగా ఉంటది. నెలకు 20 వేల చొప్పున 60 వేల పై చిలుకు నష్టం వస్తది. మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావు.

భాను చందర్‌ గుప్త, బాలాజీ పంక్షన్‌హాల్‌ చేవెళ్ల

Updated Date - Apr 30 , 2024 | 12:01 AM