Share News

మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్‌ ఆపరేషన్‌!

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:20 AM

రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ, అందుకు అనుగుణంగా సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా నాలుగు విభాగాల్లో పనిచేస్తున్నాయి.

మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్‌ ఆపరేషన్‌!

రంగంలోకి ప్రత్యేక బృందాలు

అభ్యర్థులకు అండగా షాడో టీంలు

అమిత్‌ షాకు నివేదికలు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ, అందుకు అనుగుణంగా సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా నాలుగు విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, జాతీయ పార్టీ కార్యాలయంలో మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా, పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు బృందాలు కొన్ని కీలక నివేదికలను కేంద్ర హోం మంత్రి, పార్టీ అగ్రనేత అమిత్‌ షా కార్యాలయానికి నివేదిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమిత్‌ షా, తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం, అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఒకటి, రెండు మినహా మిగతా నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం సీక్రెట్‌ ఆపరేషన్‌లో భాగంగా నాలుగు దశల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా, ఇందులో ఒకటి (షాడో టీం) అభ్యర్థి వెన్నంటి కొనసాగుతోంది. ప్రధాని మోదీ హవా అంటూ జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు.. ఏయే వర్గాలు ఈ నినాదంపై ఎక్కువ ప్రభావితమవుతున్నాయి? పార్టీ పట్ల, పోటీచేస్తున్న అభ్యర్థిపై స్థానికుల్లో ఉన్న అభిప్రాయం, కీలక ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో మారుతున్న గ్రాఫ్‌, సొంత పార్టీ నేతలు, క్యాడర్‌ నుంచి లభిస్తున్న మద్దతు, పనిచేయని నేతలు, క్యాడర్‌ వివరాలు, పార్టీకి, అభ్యర్థికి ఎక్కడ పాజిటివ్‌గా ఉంది? ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది? అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వానికి రోజువారీగా నివేదికలు వెళుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇటు రాష్ట్ర నాయకత్వానికి, అటు సంబంధిత అభ్యర్థులకు సూచనలు వస్తున్నాయి. ఏయే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలో అప్రమత్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయ సంఘటనలను పార్లమెంటు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సర్వే బృందాలు నేరుగా ఢిల్లీకి నివేదిస్తున్నాయి. మరికొన్ని వివరాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న బృందానికి అందజేస్తున్నాయి. వాటిపై సమగ్ర అధ్యయనం చేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందం, తిరిగి జాతీయ పార్టీకి నివేదిస్తోంది. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో 40 మంది సభ్యులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

అభ్యర్థుల వెన్నంటి ఉంటున్న మరో బృందం ప్రచార సరళికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తోంది. ఇదే సమయంలో సదరు అభ్యర్థి ప్రచారం సందర్భంగా ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా అనుసరించాల్సిన కార్యాచరణపై జాతీయ కార్యాలయంలో మరో బృందం నిరంతరం సమన్వయం చేస్తోందని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తమకు సైతం అందని సమాచారం, నేరుగా ఢిల్లీ నుంచి వస్తోందని పార్టీ అభ్యర్థి ఒకరు వెల్లడించారు. కాగా, పార్టీలో చేరికలు, పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వెళుతున్న నేతల ప్రభావంపైనా ప్రత్యేక బృందాలు జాతీయ నాయకత్వానికి నివేదిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల స్థానికంగా సొంత పార్టీ నేతలు ఎంతమేర మద్దతు ఇస్తున్నారు? క్యాడర్‌ వైఖరి, స్థానికుల అభిప్రాయం ఎలా ఉంది? వంటి అంశాలపై ప్రత్యేక బృందాలు నివేదిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్‌ నేతలు గడచిన పది రోజుల్లో హస్తం గూటికి చేరారు. వీరిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 9 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రత్యేక సర్వే బృందాలు జాతీయ నాయకత్వానికి నివేదించినట్లు సమాచారం.

Updated Date - Apr 18 , 2024 | 04:20 AM