Share News

కవిత జోక్యం ఉందా? లేదా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:03 AM

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత జోక్యం ఉందా? లేదా? అనే విషయాన్ని కేటీఆర్‌ స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్నారో లేదో కూడా తనకు తెలియదని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర

కవిత జోక్యం ఉందా? లేదా?

ఢిల్లీ లిక్కర్‌ కేసుపై కేటీఆర్‌ స్పందించాలి

కవిత ఎందులో.. కడిగిన ముత్యంలా వస్తారు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

కేటీఆర్‌ పనికిరానోడని విమర్శలు

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత జోక్యం ఉందా? లేదా? అనే విషయాన్ని కేటీఆర్‌ స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్నారో లేదో కూడా తనకు తెలియదని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కవిత కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి అందులో తన బినామీలను పెట్టారా.. లేదా..? ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వంతో మంతనాలు జరిపారా.. లేదా..? కోట్లాది రూపాయలు చేతులు మారాయా.. లేదా..? ఈ విషయంపై కేటీఆర్‌ స్పందించాలన్నారు. రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ సెంటిమెంటుకు, కవిత అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్‌ స్కాంలో కవిత జోక్యం లేకపోతే, ఇది అక్రమ కేసైతే కేసీఆర్‌ బహిరంగ చర్చకు వచ్చి నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంటున్నారని.. ఎందులో కడిగిన ముత్యంలా బయటకు వస్తారో చెప్పాలని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏమీ చేయలేదంటూ కేటీఆర్‌ చేసిన విమర్శపై ఘాటుగా స్పందించారు. పనికిరానోళ్లు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సికింద్రాబాద్‌లో తానేం చేశానో చెబుతానని.. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు.

‘చంగిచర్ల’ నిందితులపై చర్యలేవీ?

హోలీ పండగ సందర్భంగా చంగిచర్ల స్లాటర్‌ హౌస్‌ దగ్గర నివసిస్తున్న గిరిజన మహిళలు వేడుకలు చేసుకుంటుంటే కొందరు మతోన్మాదులు వచ్చి విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశారని, గర్భిణులు, చిన్న పిల్లలనూ వదల్లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. నామమాత్రపు కేసులతో ముగించారని విమర్శించారు. గిరిజన ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. చంగిచర్ల వధశాలలోకి మనుషులు వెళితే తిరిగి వచ్చే అవకాశం లేని భయంకర మాఫియా అక్కడ ఉందని చెప్పారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వధశాలను మూసివేయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 05:03 AM