Share News

కుర్చీ పోతుందని రేవంత్‌ భయం

ABN , Publish Date - May 06 , 2024 | 05:46 AM

తెలంగాణలో మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్ల రద్దు పేరుతో తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘

కుర్చీ పోతుందని రేవంత్‌ భయం

బీజేపీకి ఎక్కువ సీట్లొస్తే కాంగ్రెస్‌ అగ్ర నాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన

అందుకే రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం

కాంగ్రెస్‌ సర్కారును పడగొట్టే ఉద్దేశం లేదు

ఈ ప్రభుత్వం గద్దె దిగేందుకు ఐదేళ్లు ఎక్కువ

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చింది

తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారెంటీ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్ల రద్దు పేరుతో తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని రేవంత్‌కు అర్థమైంది. దీంతో కాంగ్రెస్‌ అగ్ర నాయకులు ఎక్కడ ఆయన పదవికి ఎసరు పెడతారో అన్న భయం పట్టుకుంది. అందుకే బీజేపీని బద్‌నాం చేసేందుకు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారంతో మా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణముండగా రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ చెప్పినా.. ఇంకా దుష్ప్రచారం చేస్తారా..? అని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి అంత స్పష్టంగా ప్రకటించినా.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ ఎలా తప్పుడు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ‘‘రిజర్వేషన్ల ఎత్తివేత ఎవరికైనా సాధ్యమా..? రిజర్వేషన్లను తీసేసి ఒక పార్టీ ముందుకు వెళ్లడం సాధ్యమా..? బీజేపీ రిజర్వేషన్లను ఎత్తేస్తుందని మీకేమైనా కల వచ్చిందా..? మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లను తాకేశక్తి దేశంలో ఎవరికీ లేదు’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


గ్యారెంటీలా.. గాడిద గుడ్డా..?

గ్యారెంటీలు అమలు చేయలేకపోవడం, తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమవడం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణకు కేంద్రం పదేళ్లలో రూ.9.5 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా..? పేదలకు ప్రతీ నెలా ఉచిత బియ్యం ఇస్తున్నాం.. అది గాడిద గుడ్డా..? పంచాయతీలకు నేరుగా నిధులివ్వడం గాడిద గుడ్డా..? రైతులకు ఏటా ఎకరానికి రూ.20వేల సబ్సిడీ ఇవ్వడం గాడిద గుడ్డా..? ప్రతీ రైతుకు రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తుంటే అందులో గాడిద గుడ్డు కనిపించిందా..? రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రె్‌సలో అంతర్గత విభేదాల వల్ల కూలితే మాకు సంబంధం లేదు. ఈ అంశం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల అసమ్మతి ఎజెండాల్లో ఉంటే నేనేం చేయలేను. బీఆర్‌ఎస్‌ గద్దె దిగేందుకు పదేళ్లు పడితే.. కాంగ్రెస్‌ గద్దె దిగేందుకు 5 ఏళ్లు చాలా ఎక్కువ’’అని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో మూడో కూటమి ఏర్పాటవుతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ప్రకటనపై కిషన్‌రెడ్డి స్పందించారు. ‘‘బీఆర్‌ఎస్‌ నాయకత్వం లిక్కర్‌ బ్రాండ్‌ కూటములు.. ఫాంహౌస్‌ కూటములు పెట్టుకోవచ్చు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌కు పీడకలలు వస్తున్నాయి. కేటీఆర్‌ చెబుతున్నట్లు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన లేదు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా.. ఓడినా.. వచ్చేదేం లేదు’’అని అన్నారు.


పదేళ్లలో అద్భుత ప్రగతి..

తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు బీజేపీ కృషి చేస్తుందని.. దీనికి ప్రధాని మోదీ గ్యారెంటీ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ గ్యారెంటీ అంటే దేవుళ్లపై ఒట్లు వేసి చెప్పడం కాదని.. గ్యారెంటీని అమలు చేసే గ్యారెంటీ అని అన్నారు. ప్రధానిగా మూడోసారి మోదీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని చెప్పారు. పదేళ్లలో రైల్వేలు, అంతరిక్ష ప్రయోగాలు, సాంకేతిక విప్లవం ఇలా అనేక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. దేశంలో రైల్వేల అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. సికిందరాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణను రూ.720 కోట్లతో చేపట్టామని, 25 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం తరహాలో ఈ రైల్వేస్టేషన్‌ ఉండబోతోందని చెప్పారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలవి గాలి మాటలని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - May 06 , 2024 | 05:46 AM