Share News

కాంగ్రెస్‌ పార్టీది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:23 AM

ప్రధాని మోదీ ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పథకాల ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని.. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి, సంక్షేమం

కాంగ్రెస్‌ పార్టీది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో

కుల, మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు

పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక

వారి మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం

నాణ్యమైన విద్య, పేదలకు పక్కా ఇళ్లు.. రైతు,

మహిళా సంక్షేమానికి మోదీ గ్యారెంటీ: కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పథకాల ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని.. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి, సంక్షేమం సాధించే దిశగా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల కార్యాచరణకు సంబంధించిన ఎజెండాను జూన్‌ రెండో వారంలో వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. నాణ్యమైన విద్య, పేదలందరికీ ఇళ్లు మోదీ గ్యారెంటీ అని చెప్పారు. సేవ, సుపరిపాలన.. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమం.. సుస్థిర అభివృద్ధి ఎజెండాగా మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ సంకల్ప పత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ మిల్లెట్‌ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. మూడు కోట్ల మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పారు. కీలక రంగాలకు నైపుణ్య శిక్షణను అందించడం ద్వారా స్వయం సహాయక బృందాల బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని.. భవిష్యత్తులో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో భారత్‌ను మళ్లీ విశ్వగురువును చేయడమే మోదీ గ్యారెంటీ అని వివరించారు. 3 దశాబ్దాల తర్వాత దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని తెలిపారు. ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, నక్సలైట్ల భరతం పడుతున్నామని చెప్పారు. అవినీతిపరులు జైళ్లకు పోయారని.. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ గత 70 ఏళ్లలో దేశ వ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్‌ మ్యానిఫెస్టోలా ఉందన్నారు. కులం, మతం, వర్గాలవారీగా రెచ్చగొట్టి ఓట్లు పొందేలా ఆ మ్యానిఫెస్టో తీసుకొచ్చారని మండిపడ్డారు.

కాంగ్రె్‌సవి ఓటు బ్యాంకు రాజకీయాలు

కాంగ్రె్‌సవి ఓటు బ్యాంకు రాజకీయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ముడిపెట్టిన పత్రమే రాహుల్‌ గాంధీ ‘అన్యాయ’పత్రం అని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ పాటుపడుతుంటే.. విభజన భారత్‌ కోసం కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ న్యాయపత్రం బ్రిటిషర్లు అనుసరించిన విభజించు-పాలించు మాదిరిగా ఉందని విమర్శించారు. తెలంగాణలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని.. ఇప్పుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేస్తేనే హామీల అమలంటూ మరోసారి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా మోదీ సంకల్ప పత్రాన్ని ప్రవేశపెట్టారని లక్ష్మణ్‌ తెలిపారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న బాన్సువాడ వస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 22 , 2024 | 05:23 AM