Share News

KCR : దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:43 AM

కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనంతా డొల్ల అని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అన్నారని, మరి అభివృద్ధి ఏదీ..? అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని

KCR : దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట

ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, కాషాయ జెండాలు..

వారి పాలన డొల్ల.. దేశం పరువు పోయింది

నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు

భువనగిరి రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

యాదాద్రి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనంతా డొల్ల అని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అన్నారని, మరి అభివృద్ధి ఏదీ..? అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని ఆరోపించారు. బీజేపీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు అని విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని తాము అద్భుతంగా అభివృద్ధి చేశామని, ఎన్నడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా? అని వ్యాఖ్యానించారు. తన బిడ్డను జైల్లో పెట్టినా బీజేపీకి భయపడలేదని, దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని, ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. భువనగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లే్‌షకు మద్దతుగా గురువారం కేసీఆర్‌ ప్రచారం చేశారు. రాత్రి భువనగిరిలో రోడ్‌ షోలో మాట్లాడారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటోందని.. కాంగ్రెస్‌ దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోందని విమర్శించారు. సీఎం యాదాద్రి మీద ఓట్టేసి చెబుతున్నారు కానీ చేయడం లేదన్నారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని.. పెద్ద మనిషిలా అన్నింటిపై యుద్ధం చేస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోందని.. భువనగిరి మున్సిపాలిటీలో ఆ పార్టీ చేసిందేమిటని నిలదీశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని, బీఆర్‌ఎస్‌ లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడుగడుగునా బీజేపీ ఇబ్బంది పెట్టిందని.. దానికి ఓటేస్తే మోటర్లకు మీటర్లు పెడతారని కేసీఆర్‌ హెచ్చరించారు. ‘‘కులం, మతం చూడకుండా పాలించి తెలంగాణను ఒడ్డుకు తెచ్చాం. అందరూ సంతోషంగా ఉండేలా పనిచేశాం. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మంచిగున్న తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊర్కోవాలా? పోరాడాలా? ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి పంచాయితీ పడ్డది. కేసీఆర్‌ను కిందపడేసి కొట్లాడమంటే ఎట్లా? కొట్లాడ్డానికి బలం కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలి’’ అని కేసీఆర్‌ కోరారు. దేవుడు కేసీఆర్‌ను తెలంగాణ కోసమే పుట్టించాడని.. తెలంగాణ ప్రజల గుండెను చీల్చితే కేసీఆర్‌ కనిపిస్తాడని, కేసీఆర్‌ గుండెను చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలని పేర్కొన్నారు.


రైతు బంధు ఐదెకరాలకేనా?

అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. ఐదు ఎకరాలు ఉన్నవారికే రైతు బంధు ఇస్తామంటోందని.. మిగతా రైతులు ఏం కావాలని, మీ సొమ్మేమన్నా పోతుందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తాను పక్కకు జరగ్గానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని.. ఇది కరెంటు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని మండిపడ్డారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని, 225 మంది చనిపోతే కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. భువనగిరి గురుకులంలో విద్యార్థి మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చేనేతల సంక్షేమం కోసం తెచ్చిన పథకాలను రద్దు చేశారు. రుణ మాఫీ మరిచిపోయారు. తులం బంగారం తుస్సుమనిపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కల్యాణలక్ష్మి పథకం చెక్కులు బంద్‌ అయ్యాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎగ్గొట్టారు. అమ్మాయిలకు స్కూటీలు ఏమయ్యాయి? కరెంటు బిల్లులు అడ్డగోలుగా వస్తుండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యానికి బోనస్‌ ఇవ్వలేని ఈ పాలన అంతా బోగస్‌’’ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. పంటలన్నీ ఎండిపోయాయని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వంపై ఇక యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 26 , 2024 | 05:43 AM