Share News

బీజేపీ, బీఆర్‌ఎ్‌స.. సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్‌ పార్టీలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:51 AM

బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు.. సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్‌ పార్టీలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ, బీఆర్‌ఎ్‌స.. సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్‌ పార్టీలు

సెక్యులర్‌ మాటకు కట్టుబడిన నేత రాహుల్‌.. కిషన్‌రెడ్డి, సంజయ్‌ల మాటకు విలువ లేదు

కవితకు సీబీఐ నోటీసులు ఓ కొత్త నాటకం

ఆమె అరెస్టు ఓట్లతో ముడిపడిన అంశం: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు.. సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్‌ పార్టీలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఆ పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తుంటాయని, వాటికి సిద్ధాంతాలు ఏమీ లేవని విమర్శించారు. సెక్యులర్‌ అనే మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని తెలిపారు. గాంధీ భవన్‌లో ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక కొత్త నాటకానికి తెర లేపాయని అన్నారు. ఆ పార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే.. కేసీఆర్‌ కూతురు కవితకు సీబీఐ నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లాభం చేకూరుతుందని అనుకుంటేనే కవితను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. ఆమెను జైలుకు పంపితే.. సానుభూతి వచ్చి ఓట్లు పడతాయన్నది వాళ్ల లెక్క అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి పడే ఓట్లను చీల్చాలన్నదే ఆ రెండు పార్టీల ఆలోచన అని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మధ్య పొత్తు ఉంటే చెప్పుతో కొట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు డ్రామా అని జగ్గారెడ్డి కొట్టి పారేశారు. వారి డైలాగులకు విలువ లేదన్నారు. లిక్కర్‌ కేసు.. కవిత అరెస్టు దాకా వెళ్లి ఆగిందంటేనే బండి సంజయ్‌ మాటకు విలువ లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఇక చెప్పుతో కొట్టాలన్న మాట కూడా అలాంటిదేనని అన్నారు. కవిత అరెస్టు ఎపిసోడ్‌.. రాహుల్‌ గాంధీ ప్రధాని కాకుండా చేయాలన్న కుట్రలో భాగమేనన్నారు. ఈ కుట్రలో బీఆర్‌ఎస్‌ ఒక పావుగా తయారైందని విమర్శించారు.

Updated Date - Feb 26 , 2024 | 05:51 AM