Share News

దీనావస్థలో భీమేశ్వరాలయం

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:21 AM

ప్రాచీనమైన కళా సంపదకు నిలయమైన వేములవాడలోని భీమేశ్వర ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆలయ అభివృద్ధిని పట్టించుకునేవారు లేకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దీనావస్థలో భీమేశ్వరాలయం
వేములవాడలోని భీమేశ్వర ఆలయం

- వీటీడీఏ పరిధిలోకి తీసుకోని ప్రభుత్వం

- శిథిలమవుతున్న శిల్పసంపద

- 2011లో పురావస్తు శాఖ పరిధిలోకి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రాచీనమైన కళా సంపదకు నిలయమైన వేములవాడలోని భీమేశ్వర ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆలయ అభివృద్ధిని పట్టించుకునేవారు లేకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజరాజేశ్వరస్వామి ప్రధాన దేవస్థానంతోపాటు వేములవాడకు వచ్చే భక్తులకు ఇతర సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.127.65 కోట్లతో దేవాలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేశారు. ప్రధాన దేవస్థానం గోపురానికి రూ.6 కోట్ల నిధులతో 15 కిలోల బంగారు తాపడం చేపట్టాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోనే వేములవాడలోని బద్దిపోచమ్మ దేవాలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులకు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. బద్దిపోచమ్మ, రాజరాజేశ్వరస్వామి దేవాల యాల మధ్య ఉన్న భీమేశ్వరాలయంపై మాత్రం దయ చూపడం లేదు. రెండు శాఖల మధ్య భీమేశ్వరాలయం నిర్లక్ష్యానికి గురవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011లో భీమేశ్వరాలయం అభివృద్ధికి సంబంధించి పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా వివిధ పనులు చేపడుతున్న క్రమంలో పురావస్తు శాఖపరిధిలోని భీమేశ్వరాలయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. పురావస్తు శాఖ పరిశీలన, ప్రతిపాదనలతోనే ఆగిపోయింది. ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి లేక శిథిలావస్థకు చేరుకుంటోంది.

ఖజురహో తరహాలో శిల్పకళ

దేశంలో వాస్తు శిల్ప కళలు, ఖజురహో శిల్పాలకు ప్రముఖ స్థానం ఉంది. అక్కడి శిల్పాలను చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల ఉత్సాహ పడుతారు. పురాతనమైన దేవాలయాల్లో చెక్కబడిన అనేక శిల్పాల్లోని ప్రతీ కదలిక సంసారిక జీవనంతో ముడిపడి కనిపిస్తాయి. ఆలయాల గోడలపై చెక్కిన శృంగార దృశ్యాలు ఒక కావ్యంగా చూడవచ్చు. ఎక్కడో ఉన్న ఖజురహో శిల్ప సందపదకు దగ్గరగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో కూడా చూడవచ్చు. దాదాపు 180 శిల్పాలు ఉన్నాయి. దేవుళ్లు, దేవతలు, పురుషులు, స్త్రీలు నృత్యభంగిమలు, శృంగారం, అలంకరణలు వంటివి ఎన్నో శిల్పాలు కదులుతున్నట్లే గోచరిస్తాయి. ఆ శిల్పాలను చూస్తుంటే ప్రదర్శిస్తున్న భ్రమలే కదులుతాయి. అంతటి శిల్ప సంపద మన జిల్లాలో ఉన్న చాలా మందికి తెలియక పోవడం గమనార్హం. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి దర్శనం అనంతరం క్రీస్తు శకం 9వ శతాబ్దం కాలంలో అతి సుందరంగా నిర్మించిన భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. వేములవాడను పాలించిన చాళుక్య రాజు బద్దెగుడూ క్రీ.శ.850-895లో నిర్మించారు. దీన్ని మొదట బద్దెగేశ్వరాలయంగా పిలిచేవారు. వేములవాడలోని అన్ని దేవాలయాల కంటే భీమేశ్వర ఆలయానికి ప్రత్యేకత ఉంది. అదే శిల్పకళా వైభవంగా చెప్పుకోవచ్చు. త్రిశూలం, నాగసర్పాలు, మైహిషాసురమర్ధిని, జైన చౌముఖం వంటివే కాకుండా చాళుక్యుల కళా రీతులేన్నో దర్శనమిస్తాయి. ఇలా ఎంతో ప్రాచీనమైన కళా సంపదకు నిలయమైన భీమేశ్వర ఆలయం మాత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. అనేక శిల్పాలను పట్టించుకోక పోవడంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరి పాడైపోతున్నాయి. కొన్ని విగ్రహాలు రూపాన్నే కోల్పోయాయి. కొన్ని శిల్పాలను కనీసం శుభ్రం కూడా చేయక పోవడంతో పూర్తిగా వాటి రూపం కూడా కనిపించని పరిస్థితి. భీమేశ్వరాలయం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వెళ్లే దారిలో 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకోవాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి.

పురావస్తు శాఖ నిర్లక్ష్యం

శిల్ప సోయగాలతో కళకళాడిన వేములవాడ భీమేశ్వరాలయం పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 2011లో భీమేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ తన పరిధిలోకి తీసుకుంది. రూ.30 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆలయాన్ని మళ్లీ కళకళలాడే దిశగా పరిరక్షణకు చర్యలు మాత్రం చేపట్టలేదు. ముందు తరాల వారికి శిల్ప సోయగాలను అందించే దిశగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని చరిత్రకారులు, పర్యాటకులు, వేములవాడ ప్రధాన దేవాలయంతో పాటుభీమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేయాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:21 AM