Share News

..భక్తవశంకర

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:03 AM

మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ..

..భక్తవశంకర

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు..

వేములవాడ, కీసరలో ఘనంగా వేడుకలు

ఏడుపాయలలో వనదుర్గా మహా జాతరకు అంకురార్పణ

శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు..

మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తులు

వేములవాడ/కీసర/యాదగిరిగుట్ట/పాపన్నపేట, మార్చి 8: మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ శుక్రవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆ దేవదేవున్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలతో పాటు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ప్రముఖ శైవ క్షేత్రాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని రాత్రంతా జాగరణ పాటించారు. సాయంత్రం వేళలో శివదీక్ష స్వాములు స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. సాయంత్రం ఆలయ అర్చకులు స్వామివారికి మహాలింగార్చన జరిపారు. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయాన స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పట్టువస్త్రాలు సమర్పించగా, అనంతరం టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మేడ్చల్‌ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరారు. తెల్లవారు జామున 3.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆలయ నిర్వహకులు గర్భాలయంలో రుద్రాభిషేకం, యాగశాలలో రుద్ర స్వాహకార హోమం నిర్వహించారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ దంపతులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏడుపాయలలో..

మెదక్‌ జిల్లాలో ఏడుపాయల మహాజాతరకు అంకురార్పణ జరిగింది. శివరాత్రి సందర్భంగా వనదుర్గామాత విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని బంగారు కిరీటం, ముత్యాలహారం, ఇతరత్రా ఆభరణాలతో అలంకరించారు. తెల్లవారు జామునే దుర్గాదేవికి మంగళవాయిద్యాల మధ్య అభిషేకం, సుప్రభాత సేవ నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ దంపతులు పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, తలంబ్రాలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని దుర్గామాతకు సమర్పించారు. యాదగిరిక్షేత్రంలో కొండపైన అనుబంధ శివాలయంలో విశేష పూజాపర్వాలు శైవాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా అభిషేక పూజలు కొనసాగగా భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నల్లమల అభయారణ్యం నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం బౌరాపూర్‌లో వెలసిన భ్రమరాంబికా మల్లికార్జున కల్యాణం అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహించింది. చెంచు పూజరులే వారి సంప్రదాయ పద్ధతిలో చెంచుల ఆడపడుచుగా పిలుచుకునే భ్రమరాంబికాదేవి కల్యాణాన్ని కన్నుల పండవగా జరిపారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Updated Date - Mar 09 , 2024 | 05:46 AM