Share News

కేవైసీ కేటుగాళ్లున్నారు జాగ్రత్త!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:20 AM

హైవేల్లో ప్రమాదాలు సృష్టించి.. ప్రయాణికుల నగదు, నగలతో ఉడాయించే ముఠాల తీరును చూపించిన ‘ద రోడ్‌’ తెలుగు సినిమా గుర్తుందా? గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో దొంగల ముఠాకు ఓ భారీ నెట్‌వర్క్‌ ఉంటుంది.

కేవైసీ కేటుగాళ్లున్నారు జాగ్రత్త!

బ్యాంకు రుణాల పేరుతో అమాయకులకు వల..

వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు

వాటి ద్వారా రూ. కోట్లలో లావాదేవీలు

ఉమ్మడి ఖమ్మంలో పదుల సంఖ్యలో ఏజెంట్లు

డబ్బులిచ్చి మరీ.. కేవైసీల సేకరణ

భారీ ఎత్తున సైబర్‌ నేరాలకు కుట్ర..!

ఖమ్మం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): హైవేల్లో ప్రమాదాలు సృష్టించి.. ప్రయాణికుల నగదు, నగలతో ఉడాయించే ముఠాల తీరును చూపించిన ‘ద రోడ్‌’ తెలుగు సినిమా గుర్తుందా? గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో దొంగల ముఠాకు ఓ భారీ నెట్‌వర్క్‌ ఉంటుంది. రుణాల పేరుతో గ్రామీణుల కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలను సేకరించి, వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ నేరాలకు కావాల్సినట్లుగా లావాదేవీలు జరుపుతుంది..! దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా ఎవరి పేరుతో ఉందో.. వారిని సంప్రదిస్తే.. గొర్రెలను కాచే వ్యక్తో.. నిరక్షరాస్యుడైన రోజు కూలీనో దొరకడం ఆ సినిమాలో ట్విస్టు..! ఇప్పుడు అచ్చంగా అదే తరహాలో గ్రామీణుల కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టుకొచ్చాయి. అయితే.. ఈ ముఠాలు రుణాలను కూడా ఇస్తున్నాయి. కొన్ని ముఠాలు నెలనెలా కిస్తీలను వసూలు చేస్తుండగా.. మరికొన్ని ఆ డబ్బులను వదిలేసి, కేవైసీలతో తమకు కావాల్సిన పనులను చక్కబెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పోలీసు శాఖ మిన్నకుండడం గమనార్హం..!

పదికి పైనే ముఠాలు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు పదికి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలు రుణాల పేరుతో రోజు కూలీలు, నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి గాలం వేస్తున్నాయి. వారి వద్ద ఆధార్‌ జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకుంటున్నాయి. కొన్ని ముఠాలు లోన్‌ పేరుతో కాలయాపన చేస్తుండగా.. మరికొన్ని చిన్న మొత్తంలో.. (రూ.10 వేల నుంచి రూ.75 వేల దాకా) నగదు రూపంలో అందజేస్తూ, బ్యాంకు రుణాలుగా పేర్కొంటున్నాయి. ఇలా చిన్నమొత్తంలో రుణాలిచ్చిన ముఠాల్లో కొన్ని నెలనెలా రుణగ్రహీతల ఇళ్లకు వెళ్లి కిస్తీ(ఈఎంఐ)లు వసూలు చేస్తుండగా.. మరికొన్ని ముఠాలు అసలు ఆ డబ్బును పట్టించుకోవడం లేదు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ముందే చెప్పేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. భద్రాది-కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

సైబర్‌ నేరాల కోసమేనా?

అమాయకుల కేవైసీలను కొట్టేసి, బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠాలు సైబర్‌ నేరాల కోసమే ఈ పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరి పేరుతో తెరిచిన బ్యాంకు కరెంట్‌ అకౌంట్లలో ఇతర రాష్ట్రాల నుంచి రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి, కేవైసీ గ్యాంగులన్నీ సైబర్‌ నేరగాళ్ల కోసం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గేమింగ్‌ యాప్‌లు, నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లలో బాధితులు చెల్లిస్తున్న డబ్బులన్నీ ఈ ఖాతాలకు మళ్లుతున్నట్లు.. వాటిని సైబర్‌ నేరగాళ్లు వెనువెంటనే విత్‌డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇల్లెందులో ఈ కోవలోని కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు సమాచారం. హవాలా ముఠాలు కూడా ఇలాంటి ఖాతాలను వాడుకునే ప్రమాదముందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఈ ముఠాల తీగలాగితే.. డొంక కదిలే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ కొన్ని ఘటనలు..

ఇల్లెందు మండలానికి చెందిన ఓ గ్రామదీపిక అదే మండలంలోని ఐదుగురు మహిళలకు రూ.20 వేల చొప్పున రుణాలిప్పిస్తానంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల్లో నగదు జమ అవ్వగా.. సదరు గ్రామదీపిక వాటిని విత్‌డ్రా చేసుకుని, ఆ మహిళలకు రూ.14 వేల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. అక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. నెల తర్వాత వేరే బ్యాంకు అధికారులు ఈ ఐదుగురు మహిళల దగ్గరకు వచ్చి, వారి కరెంట్‌ ఖాతాల్లో రూ.30 లక్షలకు పైగా ఉన్నట్లు చెప్పారు. చిరునామా పరిశీలనకు వచ్చామని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. వారు బ్యాంకుకు వెళ్లగా.. ఆ డబ్బు విత్‌డ్రా అయినట్లు తెలుసుకున్నారు. నెల రోజుల్లోకోట్లలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

ఖమ్మంలోని ఓ వ్యక్తికి రూ.35వేల రుణం ఇప్పిస్తానని చెప్పిన గ్రామదీపిక.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకుని ఓ ప్రైవేటు బ్యాంకు వద్దకు రావాలని సూచించింది. బ్యాంకు దగ్గరకు వెళ్లిన తర్వాత సదరు వ్యక్తితో పాటు మరో ఆరుగురిని చూపించిన ఆ గ్రామదీపిక బ్యాంకులో రూ.35వేలు లోను మంజూరు అయిందని చెప్పి.. సంతకాలు చేయించుకుంది.అదే రోజు సాయంత్రం ఆయనకు రూ.10వేలు ఇచ్చింది.అదేంటని ప్రశ్నిస్తే.. ఆ రూ.10 వేలు కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం..!

Updated Date - Mar 14 , 2024 | 04:20 AM