Share News

హరీశ్‌ను అడ్డుకున్న ‘డబుల్‌’ లబ్ధిదారులు

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:29 AM

డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులు మాజీ మంత్రి హరీశ్‌ రావును అడ్డగించారు. తమను నిరుడు లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారని, దాదాపు ఏడాదైనా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆందోళన

హరీశ్‌ను అడ్డుకున్న ‘డబుల్‌’ లబ్ధిదారులు

కేటాయించిన ఇళ్ల సర్టిఫికెట్లు ఇప్పించాలని ఆందోళన

ఏడాది క్రితం వీరంతా లక్కీ డ్రా ద్వారా ఎంపిక

లబ్ధిదారులతో కలిసి ఆర్డీవో ఆఫీసుకు హరీశ్‌

వారం రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలన్న మాజీ మంత్రి

లేదంటే ధర్నా, వంటావార్పు చేపడతానని హెచ్చరిక

గజ్వేల్‌, సిద్దిపేట, ఏప్రిల్‌ 2: డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులు మాజీ మంత్రి హరీశ్‌ రావును అడ్డగించారు. తమను నిరుడు లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారని, దాదాపు ఏడాదైనా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌ నేతలను అడిగితే తమకు సంబంధం లేదని అంటున్నారని.. ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హరీశ్‌ లోపలికి వస్తుండగా గేటు వద ్ద గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. స్పందించిన హరీశ్‌.. తాను గజ్వేల్‌ ఆర్డీవో, తహసీల్దార్‌తో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అయినా తమకు సర్టిఫికెట్లు ఇచ్చేదాకా వెళ్లేది లేదంటూ వారు దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉండిపోయారు. సమావేశం ముగిసి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు బయటకు వెళ్తున్న క్రమంలో లబ్ధిదారులు బయట నుంచి ఫంక్షన్‌హాల్‌ గేట్‌ను మూసివేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి గేట్‌ వద్దకు వచ్చి లబ్ధిదారులను సముదాయించినా వారు వినలేదు. ఈ క్రమంలో పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులొచ్చి ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను పక్కకు తోసేసి.. గేట్లు తెరిచి కొన్ని వాహనాలను పోనిచ్చారు. ఈ క్రమంలో మహిళల్లో కొందరి కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక హరీశ్‌ ఫంక్షన్‌ హాలు నుంచి తన వాహనంలో బయటకు వస్తున్న క్రమంలో మహిళలు మరోసారి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆయన తన వాహనాన్ని ఆపకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులు నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కొద్దిసేపటికి కొందరు లబ్ధిదారులతో కలిసి హరీశ్‌, గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆర్డీవో లేకపోవడంతో అక్కడి నుంచి గజ్వేల్‌ ఆర్డీవో, సిద్దిపేట ఆర్డీవోలతో పాటు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివా్‌సరెడ్డికి ఫోన్‌చేసి డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులకు వెంటే సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని, దీనికి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని పేర్కొన్నారు. లేనిపక్షంలో లబ్ధిదారుల పక్షాన తానే ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా, వంటావార్పు చేపడుతానన్నారు. కాగా రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వరికి రూ.500 బోనస్‌ వెంటనే ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్‌చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Apr 03 , 2024 | 06:29 AM