Share News

ఫోన్లు కొట్టేసి.. సూడాన్‌కు తరలించి

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:15 AM

ఫోన్‌ దొంగలు ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటారు. అడ్రస్‌ అడిగినట్లు నటించి.. వారి చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను లాక్కెళ్లిపోతారు.

ఫోన్లు కొట్టేసి.. సూడాన్‌కు తరలించి

అంతర్జాతీయ ముఠా ఆట కట్టించిన పోలీసులు.. 5గురు సూడాన్‌ దేశస్థులు, 12 మంది నగరవాసుల అరెస్ట్‌

8 రూ.1.75 కోట్ల విలువైన

703 మొబైల్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ దొంగలు ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటారు. అడ్రస్‌ అడిగినట్లు నటించి.. వారి చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను లాక్కెళ్లిపోతారు. ఇలా హైదరాబాద్‌లో దొంగతనం చేసిన సెల్‌ఫోన్లను కొనుగోలు చేసి, సముద్ర మార్గంలో విదేశాలకు రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలో వరుసగా జరుగుతున్న సెల్‌ఫోన్‌ చోరీలపై లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ ముఠా గుట్టు రట్టయిందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు.

ఈ కేసులో సెల్‌ఫోన్‌ దొంగలు, రిసీవర్లు, దుకాణ నిర్వాహకులు, విక్రేతలు మొత్తం 17 మందిని అరెస్ట్‌ చేశామని, వారిలో ఐదుగురు సూడాన్‌ దేశస్థులని తెలిపారు. ఫోన్లు దొంగిలించడానికి ముఠా సభ్యులు చోరీ చేసిన బైక్‌నే వినియోగిస్తున్నారని తెలిపిన సీపీ, స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లను బాధితులకు అందజేస్తామని చెప్పారు. తాడ్‌బండ్‌కు చెందిన మహ్మద్‌ ముజమ్మిల్‌(19), అతని స్నేహితుడు సయ్యద్‌ అబ్రార్‌(19) కలిసి డబ్బులు పంపాదించేందుకు సెల్‌ఫోన్‌ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.


తొలుత ఎల్బీనగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఓ పల్సర్‌ బైకును చోరీ చేశారు. ఆ బైకుపై బండ్లగూడ, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, మంగళ్‌హాట్‌తోపాటు హయత్‌నగర్‌లో తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న వారి దృష్టి మళ్లించి మొబైల్‌ స్నాచింగ్‌ చేస్తున్నారు. వీరు చోరీ చేసిన ఫోన్లను మహ్మద్‌ సలీమ్‌కు విక్రయిస్తున్నారు. స్నాచింగ్‌ కేసులపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. దొంగలతోపాటు రిసీవర్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పెద్ద ముఠా ప్రమేయం బయటపడింది.

దర్యాప్తులో సంతో్‌షనగర్‌కు చెందిన బైక్‌ మెకానిక్‌ సయ్యద్‌ సలీం(21).. (ఇతనిపై ఆరు స్నాచింగ్‌ కేసులున్నాయి), హఫీజ్‌బాబానగర్‌కు చెందిన పఠాన్‌ రబ్బానీ ఖాన్‌(34), జగదీష్‌ మార్కెట్‌లో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ అక్తర్‌(32), డబీర్‌పురాలో సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తున్న మహ్మద్‌ జాకీర్‌(35) (ఇతనిపై 11 కేసులున్నాయి), మొఘల్‌పురాకు చెందిన సెల్‌ఫోన్‌ వ్యాపారి షస్త్రక్‌ అజహర్‌ అలియాస్‌ జాఫర్‌(31), మహ్మద్‌ ఖాజా నిజాముద్దీన్‌ అలియాస్‌ కైజర్‌(49), సంతో్‌షనగర్‌కు చెందిన బైక్‌ మెకానిక్‌ సయ్యద్‌ లాయీక్‌(33), సంతో్‌షనగర్‌కు చెందిన షేక్‌ అజహర్‌ మొయినుద్దీన్‌(32)లను అదుపులో తీసుకున్నారు. వీరు చోరీ చేసిన మొబైల్‌ ఫోన్లను జగదీష్‌ మార్కెట్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న మహ్మద్‌ షఫీ అలియాస్‌ బబ్లూ(28), బంజారాహిల్స్‌కు చెందిన జె.యలమందరెడ్డి(44)లకు విక్రయిస్తున్నారు.

వీరిద్దరూ వాటిని సూడాన్‌ దేశస్థుడు ఖాలిద్‌ అబేడెల్‌జి మహ్మద్‌ అల్బాద్వీ(36)కి విక్రయిస్తున్నారు. ఇతను మాసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో ఉంటున్న సూడాన్‌ దేశస్థులు అబ్దేలా అహ్మద్‌ ఉస్మాన్‌ బాబికర్‌(36), బంజారాహిల్స్‌లో ఉంటున్న అయమ్‌ మహ్మద్‌ సాత్‌ అబ్దేలా(34), ఆనస్‌ సిద్దిగి ఆల్బేండర్‌ అహ్మద్‌(24), ఒమర్‌ అబ్దేల్లా ఇతయాబ్‌ మహ్మద్‌(27)ల సహకారంతో సూడాన్‌కు పంపి, అక్కడ విక్రయిస్తున్నాడు. వీరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రూ.1.75 కోట్ల విలువైన 703 స్మార్ట్‌ఫోన్లు, పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

సముద్ర మార్గంలో సూడాన్‌కు..

దొంగిలించిన ఫోన్లను సముద్ర మార్గంలో దుస్తులు, ఫ్రోజెన్‌ ఫుడ్స్‌, సీఫుడ్స్‌ మాటున రవాణా చేస్తున్నట్లు సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. చోరీ చేసిన ఫోన్లను విదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి విక్రయిస్తున్నారని, ఫోన్లలోని సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

జగదీష్‌ మార్కెట్‌లోని కొందరు వ్యాపారులు స్నాచింగ్‌ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని, మరికొందరు వాటిలో పనికి వచ్చే విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం పట్టుకున్న స్నాచింగ్‌ ముఠాను పోలినవి మరిన్ని ఉండవచ్చని.. దొంగలు, రిసీవర్లు, విక్రేతలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 06:15 AM