Share News

ట్రోలింగ్‌ భూతాన్ని తరిమికొడతాం

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:24 AM

అభ్యుదయ శక్తులను, సామాజిక కార్యకర్తలను కలవరపెడుతున్న ట్రోలింగ్‌ భూతాన్ని తరిమికొడతామని పలువురు వక్తలు శపథం చేశారు. ఈ విష సంస్కృతిని మనో ధైర్యంతో ఎదుర్కొనాలని, సంఘటితమై పోరాడాలని బాధితులకు సూచించారు.

ట్రోలింగ్‌ భూతాన్ని తరిమికొడతాం

‘ప్రరవే’ రాష్ట్ర మహాసభల్లో పలువురు వక్తల శపథం

ఖమ్మం సాంస్కృతికం ఫిబ్రవరి 11: అభ్యుదయ శక్తులను, సామాజిక కార్యకర్తలను కలవరపెడుతున్న ట్రోలింగ్‌ భూతాన్ని తరిమికొడతామని పలువురు వక్తలు శపథం చేశారు. ఈ విష సంస్కృతిని మనో ధైర్యంతో ఎదుర్కొనాలని, సంఘటితమై పోరాడాలని బాధితులకు సూచించారు. ఖమ్మంలోని వేదిక ఫంక్షన్‌ హాల్‌లో శని, ఆదివారాల్లో ప్రజా రచయిత్రుల వేదిక (ప్రరవే) రాష్ట్ర ఏడో మహాసభలు నిర్వహించారు. ప్రముఖ యాంకర్‌ ఉదయభాను, జర్నలిస్టు తులసి చందు, ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణ గోగులమండ, నాస్తికవాది బైరి నరేష్‌ తదితరులు ట్రోలింగ్‌కు గురైన సందర్భంలో తమ పరిస్థితిని, దానిని ఎదుర్కొన్న తీరును ఆదివారం సభలో వివరించారు. ప్రముఖ కవయిత్రి శీలా సుభద్రాదేవి అధ్యక్షతన జరిగిన సభలో కవయిత్రి కాత్యాయినీ విద్మహే సంకలనం చేసిన ‘నారి సారించిన నవల’ పుస్తకాన్ని స్త్రీవాద కవయిత్రి శిలాలోలిత ఆవిష్కరించారు. అనంతరం టీఎ్‌సపీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దేశంలో భిన్న భావజాలాలను అణగదొక్కడం ద్వారా ఒకే భావజాలాన్ని రుద్దే చర్యలు అమలవుతున్నాయన్నారు. ఇందుకోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ పనిచేస్తున్నదని ఆరోపించారు. ప్రజా గాయని విమలక్క మాట్లాడుతూ ట్రోలింగ్‌ బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ట్రోలింగ్‌ బాధితుల కథనాలతో ముద్రించిన ‘ట్రోల్‌’ పుస్తకాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా శనివారం ఆవిష్కరించారు. వీక్షణం సంపాదకుడు, విరసం మాజీ నేత ఎన్‌.వేణుగోపాల్‌ ప్రసంగిస్తూ ఎన్‌ఐఏ దాడులు తన మనోధైర్యాన్ని, పనితీరును దెబ్బతీయబోవన్నారు. రాజకీయంగా కూడా ట్రోలింగ్‌ సమస్య పెచ్చుమీరుతోందని, దీనికి బీజేపీనే కారణం అని నిందించారు. కాగా, ప్రరవే జాతీయ అధ్యక్ష కార్యదర్శులుగా అనిశెట్టి రజిత, ఎండ్లూరి మానసలను ఎన్నుకున్నారు. సమన్వయకర్తగా పి.రాజ్యలక్ష్మి, కోశాధికారిగా కొమర్రాజు రామలక్ష్మి, ఏపీ అఽధ్యక్షురాలిగా పి.అమరజ్యోతి, కార్యదర్శిగా కేఎన్‌ మల్లీశ్వరి, సమన్వయకర్తగా కావూరి శారద, నియామక ప్రతినిధిగా జహాఆరా, కార్యవర్గ సభ్యులుగా మందరపు హైమవతి, రచన శృంగవరపు, లక్ష్మీసుహాసిని, తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులుగా తిరునగరి దేవకీదేవి, కాత్యాయిని విద్మహే, సమన్వయకర్తగా బండారి సుజాత, నియామక ప్రతినిధిగా తాళ్లపల్లి యాకమ్మ, కార్యవర్గ సభ్యులుగా శాంతి ప్రబోధ, షహనాజ్‌ బేగం, పాత శ్రీలక్ష్మి, కొలిపాక శోభారాణి, గిరిజన ప్రతనిధిగా కుంజ కళ్యాణిలను నియమించారు.

Updated Date - Feb 12 , 2024 | 02:24 AM