Share News

తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:22 AM

అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన వడ్లన్నీ ప్రభుత్వమే కొనాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వేలాది క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో

తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే

సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి

కేటీఆర్‌తో పొన్నం కుమ్మక్కు: బండి సంజయ్‌

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కొనుగోలు కేంద్రాల పరిశీలన

సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే వడ్లు తడిచాయి.. కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ

నూలు అక్రమ కొనుగోళ్లపై తక్షణమే విచారణ చేపట్టాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌/ సిరిసిల్ల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన వడ్లన్నీ ప్రభుత్వమే కొనాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వేలాది క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనలో అంతకంటే ఎక్కువ మోసం జరుగుతోందని ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తామన్న కేసీఆర్‌, కేటీఆర్‌ మాటలు గాలికి ఎగిరిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు కూడా కేసీఆర్‌ స్కూల్లోనే ట్రైనింగ్‌ తీసుకుని వచ్చినట్టున్నారని, దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం బండి సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ జూన్‌ 4నాటికి ఎన్నికల కోడ్‌ ముగుస్తుందని, ఆ మరుసటి రోజే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎందుకు చెప్పడం లేదు? అని కాంగ్రె్‌సను నిలదీశారు. ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఓట్లు దండుకుని, రుణమాఫీ హామీని ఎగ్గొట్టాలన్నది ఆ పార్టీ ఎత్తుగడ అని ఆరోపించారు. మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, కానీ.. రాష్ట్రంలో ప్రస్తుతం మద్దతు ధర కన్నా రూ.500తక్కువకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి కుట్ర

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం గానీ, అవసరం గానీ బీజేపీకి లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. పాపం.. కాంగ్రె్‌సను చూస్తే జాలేస్తోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. ‘‘రాముడిపై భక్తి ఉండాలి. కానీ.. రాముడి పేరు వింటేనే బీఆర్‌ఎస్‌, కాంగ్రెసోళ్లు భయపడిపోతున్నారు. అయోధ్య అక్షింతలను రేషన్‌ బియ్యం అనేటోళ్లను ఏమనాలె? బీఆర్‌ఎస్‌ గుడిని మింగే రకమయితే, కాంగ్రెస్‌ గుడిలోని లింగాన్ని కూడా మింగే రకం’’ అని నిప్పులు చెరిగారు. తనను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి కుమ్మక్కు కుట్రలకు తెరదీశాయన్నారు.

కేటీఆర్‌, మంత్రి పొన్నం కుమ్మక్కు

మాజీ మంత్రి కేటీఆర్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కుమ్మక్కై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారని సంజయ్‌ ఆరోపించారు. యారన్‌ కొనుగోళ్లలో రూ.కోట్ల మేర దోపిడీ జరుగుతుంటే, నేతన్నలు నష్టపోతుంటే.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బాధ్యత వహించాల్సింది బీఆరెస్సేనని అన్నారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీల వద్ద నుంచే నూలు కొనుగోలు చేయాలని షరతు పెట్టారని, ఆ కారణంగానే నేతన్నలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నా... చేనేత కార్మికుల సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఈ అంశాలపై విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు. చేనేత కార్మికులకు ఏడాదిపాటు ఉపాధికి ఇబ్బంది లేకుండా ఆర్డర్లు ఇవ్వాలని, పాత విద్యుత్‌ బకాయిలు మాఫీ చేయాలని, రూ.370కోట్లతో ప్రవేశపెట్టిన వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 05:22 AM