Share News

స్థిరాస్తుల లావాదేవీలు బంద్‌!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:38 AM

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా-హెచ్‌ఎండీఏ) మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ స్థిరాస్తులకు సంబంధించి లావాదేవీలు నిలిపివేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు ఈనెల 9న లేఖ రాశారు. శివ బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట

స్థిరాస్తుల లావాదేవీలు బంద్‌!

శివ బాలకృష్ణ కేసులో యాదాద్రి కలెక్టర్‌కు ఏసీబీ లేఖ..

తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌లకు కలెక్టర్‌ నుంచి ఆదేశాలు

యాదాద్రి జిల్లాలో రెరా మాజీ కార్యదర్శికి 57 ఎకరాలు!

మార్కెట్‌ ధర ప్రకారం రూ.35కోట్ల విలువైన భూమి

వలిగొండ, బీబీనగర్‌, మోత్కురు మండలాల్లో గుర్తింపు

అన్నీ కుటుంబసభ్యుల పేరిటే.. చాలా మటుకు 2021-23 మధ్య కొన్నవే

లావాదేవీలు చేపట్టొద్దు.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన ఏసీబీ

నేడు ఏసీబీ విచారణకు బినామీలు శివ బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

యాదాద్రి, హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా-హెచ్‌ఎండీఏ) మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ స్థిరాస్తులకు సంబంధించి లావాదేవీలు నిలిపివేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు ఈనెల 9న లేఖ రాశారు. శివ బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల్లో ఎలాంటి లావాదేవీలు చేపట్టొదని, ఉంటే వెంటనే ఆపేయాలని ఏసీబీ అధికారులు లేఖలో పొందుపర్చినట్లు తెలిసింది. అటు.. కలెక్టర్‌ కూడా.. శివబాలకృష్ణకు సంబంధించిన భూముల్లో రిజిస్ట్రేషన్లు, ధరణిలో మ్యూటేషన్లు, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ నిలిపివేయాలని సంబంధిత తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీచేశారు. ఏసీబీ అధికారుల విచారణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో శివ బాలకృష్ణకు ఎనిమిదెకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని ప్రాథమికంగా అంచనా వేసినా. ఆయన కుటుంబసభ్యుల పేరుపై జిల్లాలోని వలిగొండ, బీబీనగర్‌, మోత్కురు మండలాల్లో రూ.35కోట్లకు విలువచేసే సుమారు 57ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు సర్వే నంబర్లవారీగా గుర్తించారు. ఈ భూముల్లో కొంతమేరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. వలిగొండ మండలం నర్సాపూర్‌లో సర్వే నెంబర్లు 96, 98, 99 బై నంబర్లలో 8ఎకరాలు భూమి ఎస్‌.హరిప్రసాద్‌ అనే వ్యక్తిపై ఉంది. అదేవిధంగా సర్వే నంబర్లు 100, 101, బై నంబర్లలో 11.3ఎకరాల భూమి ఎస్‌.రఘుదేవిపై రిజిస్ట్రేషనైంది. వలిగొండ మండలం చిత్తాపూర్‌లో సర్వే నంబర్లు 32, బై నంబర్లలో ఎస్‌.పద్మావతి పేరు మీద 3.31ఎకరాలు, బీబీనగర్‌ మండలం చిన్నరావుపల్లిలో సర్వే నంబరు 44ఈ1/2లో శివ అరుణ పేరుపై 20గంటలు, మోత్కురు మండలం పాలడుగులో సర్వే నంబరు 31, 32, 33, బై నంబర్లలో శివ నవీన్‌కుమార్‌ పేరుతో 26.08ఎకరాలు, వలిగొండ మండలం రెడ్ల రేపాకలో సర్వే నంబరు 500, 503, 504, 505, 506, 527 బై నంబర్లలో శివ కుమార్‌ పేరు మీద 8.84 ఎకరాలు రిజిస్ట్రేషనైంది. రెడ్లరేపాకలో 2009లో భూములు కొనుగోలు చేయగా మిగతా భూములన్నీ కూడా 2021-2023 మధ్య కొన్నారు. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు(ఫ్రీజ్‌) చేపట్టొదని, వెంటనే ఆపేయాలని ఏసీబీ అధికారులు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 9వ తేదీన లేఖ రాశారు.

రెరా మాజీ కార్యదర్శి బెయిల్‌కు నో

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలకృష్ణకు బెయిల్‌ ఇచ్చేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సోమవారం విచారణ అనంతరం ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కేసులో ఏసీబీ కస్టడీ ముగిసిందని, కొత్తగా ఎలాంటి సమాచారం రాబట్టే అవకాశం లేదని బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా బాలకృష్ణ న్యాయవ్యాది కోర్టుకు నివేదించారు. అయితే కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారించాల్సి ఉందని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వరాదని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. వాదనల అనంతరం న్యాయస్థానం బాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఇదే కేసులో అరెస్టయి జుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న బాలకృష్ణ తమ్ముడు నవీన్‌ కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్‌, సత్యనారాయణ, భరణిని మరింత లోతుగా విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా కొందరు బినామీలకు ఏసీబీ నోటీ్‌సలు జారీ చేసింది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు, విచారణలో బినామీలు ఇచ్చే సమాచారం ఆధారంగా చట్టప్రకారం తదుపరి చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్‌ అదికారి విషయంలో ప్రభుత్వ అనుమతి మేరకు కేసులో ఏసీబీ తదుపరి ముందడుగు వేయనుంది.

Updated Date - Feb 13 , 2024 | 04:38 AM