బిల్లుల మంజూరు కోసం ‘బీ’ టాక్స్
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:46 AM
రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల మంజూరు కోసం కొత్తగా ‘బీ’ టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘‘పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 8-9శాతం బీ టాక్స్ కట్టాల్సి

8-9శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు
ధరణి పోర్టల్‌లో రూ.2లక్షల కోట్ల కుంభకోణం
కేసీఆర్, కేటీఆర్‌ను రక్షిస్తున్నదెవరు?: ఏలేటి
హైదరాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల మంజూరు కోసం కొత్తగా ‘బీ’ టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘‘పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 8-9శాతం బీ టాక్స్ కట్టాల్సి వస్తోంది. ఇప్పటివరకు ‘ఆర్’ టాక్స్ పేరిట వసూళ్లు చేయగా.. ఇప్పుడు ‘బీ’ టాక్స్ పేరిట బాదుతున్నారని కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు’’ అని వివరించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘ధరణి’ అని, ఇందులో రూ.2లక్షల కోట్ల మేర గోల్‌మాల్ జరిగిందన్నారు. ఇందులో 40శాతం వాటా కోసం కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని, తద్వారా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లేకుంటే కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు రక్షిస్తున్నారని సీఎం రేవంత్‌ను నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 18లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1.30లక్షల ఎకరాల భూదాన్ భూములు, 60వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. కాంగ్రె్‌సలో చేరగానే కేకే, బొంతు రామ్మోహన్, రంజిత్‌రెడ్డి.. ఆణిముత్యాలయ్యారా? అని ప్రశ్నించారు. కాగా, కాంగ్రె్‌సలో చేరేందుకు మంత్రి పదవి డిమాండ్ చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్‌రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి ఏమైనా ప్రధాన మంత్రా? ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.