Share News

ప్రజాభవన్‌ ఎదుట ఆటోకు నిప్పు!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:59 AM

మహాలక్ష్మి పథకం అమలుతో ఆటో కిరాయిలు దొరకట్లేదని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్‌ గురువారం ప్రజాభవన్‌ ముందే తన వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

ప్రజాభవన్‌ ఎదుట ఆటోకు నిప్పు!

గిరాకీ లేదని ఆటోడ్రైవర్‌ మనస్తాపం

పంజాగుట్ట, ఫిబ్రవరి1 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం అమలుతో ఆటో కిరాయిలు దొరకట్లేదని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్‌ గురువారం ప్రజాభవన్‌ ముందే తన వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్‌ నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మంటలను ఆర్పేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దేవ్ల (45)మియాపూర్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో కొంతకాలంగా ఆటోకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తన ఆటో తోలుకుంటూ బేగంపేట ప్రజాభవన్‌ వద్దకు వచ్చాడు. ఆటో దిగి వాహనంపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. పోలీసు సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకోని మంటలను ఆర్పేశారు. దేవ్లను పంజాగుట్ట పీఎ్‌సకు తరలించారు. మద్యం మత్తులోనే ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 07:16 AM