Share News

గంజాయి మత్తులో రాళ్లతో దాడి.. యువకుడి మృతి

ABN , Publish Date - Jan 19 , 2024 | 05:38 AM

గంజాయి మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రిపాలైన కామారెడ్డికి చెందిన ఓ యువకుడు దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం గురువారం కన్నుమూశాడు.

గంజాయి మత్తులో రాళ్లతో దాడి.. యువకుడి మృతి

కామారెడ్డిలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

కామారెడ్డి టౌన్‌, జనవరి 18: గంజాయి మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రిపాలైన కామారెడ్డికి చెందిన ఓ యువకుడు దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం గురువారం కన్నుమూశాడు. ఆ యువకుడి మరణం పోలీసుల దృష్టికి వెళ్లడంతో జరిగిన దారుణం బయటకొచ్చింది. పోలీసు కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన సూర్యకాంత్‌(25) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఫర్నిచర్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. కామారెడ్డికే చెందిన నరేందర్‌, రాఖేష్‌, మనోజ్‌, ప్రణీత్‌, మరో మైనర్‌ బాలుడు గత డిసెంబరు 29వ తేదీ రాత్రి ఆ దుకాణం వద్ద మూత్రవిసర్జన చేశారు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న సూర్యకాంత్‌ సోదరుడు శివ ఆ యువకులను ప్రశ్నించాడు. గంజాయి, మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు శివతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సూర్యకాంత్‌ వారిని నిలువరించే యత్నం చేశాడు. కానీ, రెచ్చిపోయిన ఆ యువకులు సూర్యకాంత్‌ తలపై రాళ్లు, ఇనుప రాడ్‌తో కొట్టారు. శివను కూడా గాయపరిచారు. అటుగా వెళుతున్న అంబులెన్స్‌ సిబ్బంది వాహనాన్ని ఆపి దాడిని అడ్డుకోగా నిందితులు పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సూర్యకాంత్‌ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, సూర్యకాంత్‌ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దాడి జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నారు.

Updated Date - Jan 19 , 2024 | 05:38 AM