Share News

గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం యంత్రం కట్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:23 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ, చౌటుప్పల్‌ ప్రాంతాల్లోని ఏటీఎం యంత్రాల్లో నగదు చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. దొంగతనం చేస్తుండగా కథ అడ్డం తిరగడంతో కాలికి బుద్ధి

గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం యంత్రం కట్‌

మంటలు రేగడంతో పారిపోయిన దొంగలు

కోదాడ మండలం గుడిబండలో 8 లక్షలు బుగ్గి

చౌటుప్పల్‌లోనూ ఏటీఎంలో చోరీకి యత్నం

కోదాడరూరల్‌, చౌటుప్పల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 29: ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ, చౌటుప్పల్‌ ప్రాంతాల్లోని ఏటీఎం యంత్రాల్లో నగదు చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. దొంగతనం చేస్తుండగా కథ అడ్డం తిరగడంతో కాలికి బుద్ధి చెప్పారు. శని, ఆదివారాల్లో సెలవులు కావటంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని యూనియన్‌ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకు సిబ్బంది రూ.10లక్షల నగదు ఉంచారు. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో నలుగురు దుండగులు కారులో వచ్చి బ్యాంకు కింది భాగంలో ఉన్న ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లారు. లోపల ఉన్న సీసీ కెమెరాలపై రసాయనం చల్లారు. అలారం వైరును కట్‌ చేశారు. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం ముందుభాగాన్ని కోస్తుండగా మంటలు వ్యాపించాయి. దీంతో దొంగలు భయపడి పరారయ్యారు. ఓ ఆటోడ్రైవర్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎం కేంద్రంలో మంటలను అదుపు చేశారు. రూ.8.12 లక్షల నగదు కాలిపోయినట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌లోకి ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో ఓ దొంగ వెళ్లాడు. ఏటీఎం వెనుక భాగం నుంచి నగదు చోరీకి యత్నిస్తుండగా సైరన్‌ మోగటంతో పరారయ్యాడు. నగదు కోసం వెళ్లిన ఓ వ్యక్తి ఏటీఎం యంత్రంలో కొన్ని భాగాలు తొలగించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Updated Date - Apr 30 , 2024 | 04:23 AM