Share News

తవ్వినకొద్దీ ఆస్తులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:22 AM

రాష్ట్రంలో కలకలం రేపిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి.

తవ్వినకొద్దీ ఆస్తులు

శివబాలకృష్ణకు బినామీ పేర్లతో ఫ్లాట్లు, కంపెనీలు

రియల్టీలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ పెట్టుబడులు

బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ 400 కోట్లు?

రిమాండ్‌ రిపోర్టులో వివరాలు వెల్లడించిన ఏసీబీ

బినామీ ఆస్తులు, ఇతర అధికారుల పాత్రపై ఆరా

శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకునే యోచన

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కలకలం రేపిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఏయే కంపెనీలు, ఎవరెవరి వద్ద శివబాలకృష్ణ లంచాలు తీసుకుని అక్రమంగా అనుమతులు ఇచ్చారనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటిదాకా బయటపడిన ఆస్తులు, పత్రాల ఆధారంగా శివబాలకృష్ణ కూడబెట్టిన ఆస్తుల విలువ.. మార్కెట్‌ ప్రకారం రూ.400 కోట్లకుపైనే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ, దానికి రెండింతలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో శివబాలకృష్ణ నివాసం సహా 18 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సోదాల్లో పెద్దమొత్తంలో స్థిర, చర ఆస్తులు బయటపడినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. మొత్తం 45 పేజీలతో రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం.. బాలకృష్ణ నివాసముంటున్న పుప్పాలగూడలోని సెక్రటేరియట్‌ కాలనీ ఆదిత్య ఫోర్ట్‌వ్యూ విల్లాలో 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, బంగారు ఆభరణాలు, ఖరీదైన వాచీలను సీజ్‌ చేశారు. బాలకృష్ణకు నాలుగు బ్యాంకు ఖాతాలు బినామీల పేర్లతో ఉన్నట్లు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మైహోం బూజాలో డింగరి కిరణ్‌ ఆచార్య, హనుమకొండ భవానీనగర్‌లో సింగరాజు ప్రమోద్‌కుమార్‌, మాదాపూర్‌ సాహితి సుముఖి ఆర్బిట్‌ అపార్ట్‌మెంట్‌, హబ్సిగూడ వీవీ నగర్‌లో కొమ్మిడి సందీ్‌పకుమార్‌ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్లు, బాచుపల్లి శిల్ప ఆర్‌వీ ధరిస్తా అపార్ట్‌మెంట్‌లో సత్యనారాయణ మూర్తి పేర్లతో ఉన్న ఫ్లాట్లను గుర్తించినట్లు రిమాండ్‌ రిపోర్టులో వివరించారు. ఇవే కాకుండా.. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లోనూ శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బినామీలను పూర్తిస్థాయిలో విచారించడంతోపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న శివబాలకృస్ణను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.

వాచీల ఖరీదు రూ.32 లక్షలు...

శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయంతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సమయంలో రూ.99.60 లక్షల నగదు, బంగారు ఆభరణాలతోపాటు ఎక్కువగా ఇంపోర్టెడ్‌ వాచీలను ఏసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ వాచీల విలువ రూ.32.38 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ వాచీలన్నీ వివిధ పనులకు ఇతరుల నుంచి బహుమతులుగా స్వీకరించినట్లుగా అనుమానిస్తున్నారు. వీటితోపాటు రూ.51 లక్షలు విలువ చేసే నాలుగు కార్లు, నాలుగు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.58 లక్షలు బ్యాలెన్స్‌ను గుర్తించారు. వేర్వేరు బ్యాంకుల్లో లాకర్స్‌ను గుర్తించిన అధికారులు కుటుంబ సభ్యుల సమక్షంలో వాటిని తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. సోదాల్లో మొత్తం రూ.8.26 కోట్లు విలువైన బంగారం, వెండి, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. 155కు పైగా డాక్యుమెంట్లు, ఎల్‌ఐసీ బాండ్స్‌, 20 ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. డాక్యుమెంట్ల ఆధారంగా.. శివబాలకృష్ణతో అంటకాగిన వారు, ఆయా పనుల్లో ఆయనకు సహకారం అందించి ఎక్కడికక్కడ ఫైళ్లు క్లియర్‌ చేసిన వారిపైనా ఏసీబీ దృష్టి సారించింది. శివబాలకృష్ణ బినామీలపై కూడా దృష్టి సారించారు. అతని సోదరుల ఇళ్లు సహా హిమాయత్‌నగర్‌లో బంధువుల ఇళ్లను తనిఖీ చేశారు. కీలక డాక్యుమెంట్స్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనుమతులు సాధ్యం కాదంటూనే..!

భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల సందర్భంలో.. అడ్డంకులున్నాయని, సాధ్యం కాదని తొలుత చెప్పడం, ముడుపులు ముట్టజెప్పగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం శివబాలకృష్ణ స్టయిల్‌గా చెబుతుంటారు. ముడుపులతో ఆయన ఇంటి వద్దకు చేరితే సాంకేతిక అంశాలన్నీ అడ్డు తొలగి అనుమతులు వస్తాయని అంటున్నారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఐదేళ్లకు పైగా కొనసాగినా.. ఆయన మాసబ్‌ ట్యాంక్‌లోని డీటీసీపీ బిల్డింగ్‌ నాలుగు అంతస్తులో ఉన్న తన కార్యాలయం నుంచే విధులు నిర్వర్తించారు. ముడుపుల వ్యవహరాలను మాత్రం పుప్పాలగూడలోని ఆదిత్యపోర్టు వ్యూ నుంచే చక్కబెట్టారనే ఆరోపణలున్నాయి.

అవినీతి వెనుక కేటీఆర్‌: చనగాని

తార్నాక: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అవినీతి వెనుక మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ ఆరోపించారు. శనివారం ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన విచారణలో శివబాలకృష్ణతోపాటు మరింత మంది అవినీతి తిమింగళాలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విలువైన భూములను హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్‌ ఢిల్లీలో ఉన్న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అవినీతికి తెగబడ్డారని ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ముంటే 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.

Updated Date - Jan 28 , 2024 | 03:22 AM