Share News

పల్లె ప్రగతిపై ఆరా..!

ABN , Publish Date - May 25 , 2024 | 11:25 PM

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులపై నివేదిక కోరింది. పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పరిశీలిస్తున్నారు.

పల్లె ప్రగతిపై ఆరా..!

పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ

క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు

మేడ్చల్‌ మే 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులపై నివేదిక కోరింది. పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పరిశీలిస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడేళ్ల కిందట పల్లె ప్రగతి పేరుతో పనులు చేపట్టింది. ప్రకృతివనాలు, శ్మశానవాటికలు, కంపోస్టుషెడ్లు, పల్లెనర్సరీలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. వీటిని ఉపాధిహామి పథకానికి అనుసంధానించి రూ. కోట్ల నిధులు వెచ్చించారు. ప్రస్తుతం ఆ పనుల తీరు ఏ విధంగా ఉందో వెంటనే ప్రభుత్వానికి నివేదించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు.

అధికారుల పరిశీలన

పల్లె ప్రగతి పనులపై ప్రభుత్వం ఆరా తీయడంతో అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. శ్మశానవాటికలకు నీరు, విద్యుత్తు, రోడ్లు, మూత్రశాలల ఏర్పాటు తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రకృతి వనంలో నాటిన మొక్కలు బతికి ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. వాటి వివరాల నమోదు చేసుకుంటున్నారు. తడి, పొడి చెత్త కంపోస్టు షెడ్లకు తరలించారా? ఏ మేరకు సేంద్రియ ఎరువులు తయారు చేశారు? ఇప్పటి వరకు సమకూరి ఆదాయం వంటి అంశాలను సేకరిస్తున్నారు. క్రీడా ప్రాంగణాల్లో వసతుల కల్పన, అమర్చిన పరికరాలు, పల్లె నర్సరీల్లో నాటిన విత్తనాలే ఏ మేరకు మొలకెత్తాయో క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి అయ్యాక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఎంపీవోలు, డీఎల్‌పీ, డీపీఓ సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలిస్తున్నారు.

గాడి తప్పిన నిర్వహణ..

గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి పనులు ఆర్భాటంగా చేపట్టారు. రెండేళ్ల పాటు వీటి నిర్వహణపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ తర్వాత నిర్వహణ గాడి తప్పింది. కొన్ని శ్మశానవాటికలకు మాత్రమే నీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. మిగతా వాటికి వసతులు కల్పించాల్సి ఉంది. తడి పొడి చెత్త నిర్వహణ, కంపోస్లు ఎరువులు తయారీ కావడం లేదు. గ్రామీణ క్రీడాప్రాంగణాలు అలంకారప్రాయంగానే ఉన్నాయి. పల్లె నర్సరీల నిర్వహణ సరిగ్గా లేదు. వీటన్నింటికీ సౌకర్యాలు కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిశీలిస్తున్నాం: వెంకయ్య, డీపీవో

ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పల్లెప్రగతిపై నివేదిక రూపొందిస్తున్నాము. పది రోజుల్లో పూర్తి చేసి పూర్తి ప్రభుత్వానికి అందజేస్తాము. పంచాయతీ క్యాదర్శులు, ఎంపీవోలు, డీఎల్‌పీలో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పనులు ఏ మేరకు చేపట్టారు, ఇంకా ఏ మేరకు చేపట్టాల్సి ఉంది తదితర వివరాలు నమోదు చేస్తున్నాం.

Updated Date - May 25 , 2024 | 11:25 PM