Share News

అరూరి రమేశ్‌ యూటర్న్‌!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:17 AM

వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను పార్టీ మారుతున్నానని, బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని

అరూరి రమేశ్‌ యూటర్న్‌!

కేటీఆర్‌, హరీశ్‌రావుతో ఫలించిన చర్చలు

పార్టీ మారడం లేదంటూ వీడియో సందేశం

వరంగల్‌ ఎంపీ టికెట్‌పై కేసీఆర్‌ హామీ!

వరంగల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను పార్టీ మారుతున్నానని, బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, తనపై ప్రత్యర్థి పార్టీలు కుట్రతో దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొంటూ రమేశ్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట స్థానంలో ఓటమిపాలైన అరూరి రమేశ్‌.. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కేసీఆర్‌ నుంచి ఎలాంటి హమీ లభించకపోగా, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యను ఎంపీ బరిలో దించుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో అసంతృప్తితో ఉన్న అరూరికి బీజేపీ పెద్దల నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆఫర్‌ వచ్చినట్లు ప్రచారం జరిగింది. రమేశ్‌ తన ముఖ్య అనుచరులతో కలిసి ఐదారు రోజులుగా సంప్రదింపులు కూడా జరిపారు. బీజేపీలో చేరేందుకు అరూరి సిద్ధమైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా నేరుగా చర్చలు జరిపినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిన అరూరి రమేశ్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు మరోసారి విడివిడిగా చర్చలు జరపడంతో ఆయన యూటర్న్‌ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ ఎంపీ టికెట్‌పై కూడా గులాబీ అధిష్ఠానం నుంచి హమీ లభించినట్లు సమాచారం.

Updated Date - Mar 06 , 2024 | 04:17 AM