Share News

బీజేపీతో కలవలేదనే అరెస్ట్‌: హరీశ్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:26 AM

బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోలేదనే అక్కసుతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మెదక్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీతో కలవని వారందరిపై

బీజేపీతో కలవలేదనే అరెస్ట్‌: హరీశ్‌

మెదక్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోలేదనే అక్కసుతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మెదక్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీతో కలవని వారందరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కవిత అరెస్టులే అందుకు నిదర్శనమన్నారు. ఓ వైపు ఈడీ అరెస్టులను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఖండిస్తుండగా, ఇక్కడ రేవంత్‌రెడ్డి సమర్థిస్తుండడం హాస్యాస్పదమన్నారు. గుజరాత్‌ నమూనా విఫలమైందని రాహుల్‌ బీజేపీపై విమర్శలు చేస్తుంటే.. మన సీఎం మాత్రం గుజరాత్‌ మోడల్‌ సూపర్‌ అంటుండడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. చోర్‌ అదానీ అని రాహుల్‌ అంటే, అదే అదానీతో దోస్తీ కట్టడం రేవంత్‌కే చెల్లిందన్నారు. వందరోజుల పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రఘునందన్‌రావు పనితీరు బాగా లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి 54వేల ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రూ. 15 వేలు రైతుబంధు వచ్చిన వారే కాంగ్రె్‌సకు ఓటెయ్యాలని, రానివారంతా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓటు వేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రె్‌సకు పార్టీలో చేరుతున్న వారిపై ఉన్న ప్రేమ రైతులపై లేదని ధ్వజమెత్తారు. పంటలు ఎండుతుంటే పట్టించుకోని సీఎం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో ఇప్పటివరకూ మైనార్టీలకు చోటు కల్పించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో రైతుబంధు, పింఛన్లు, 24 గంటల కరెంట్‌ వంటి పథకాలేవి అమలు జరగడం లేదని విమర్శించారు. కాంగ్రె్‌సకు ఓట్లేస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పరవాలేదని ఒప్పుకున్నట్లు అవుతుందని హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 04:26 AM