Share News

దరఖాస్తులు.. బుట్టదాఖలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:11 AM

సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో పేదల నుంచి స్వీకరించిన దరఖాస్తులు అఽధికారుల నిర్లక్ష్యంతో బుట్టదాఖలయ్యాయి.

దరఖాస్తులు.. బుట్టదాఖలు

ఆన్‌లైన్‌ చేయని కొందరు రాజవరం గ్రామస్థుల దరఖాస్తులు

సబ్సిడీ అందక నిరుత్సాహం

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

తిరుమలగిరి(సాగర్‌), జూలై 30: సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో పేదల నుంచి స్వీకరించిన దరఖాస్తులు అఽధికారుల నిర్లక్ష్యంతో బుట్టదాఖలయ్యాయి. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ సబ్సిడీలకు అనర్హులవుతున్నారు. మండలంలోని రాజవరం గ్రామంలో గత ఏడాది డిసెంబరు 28వ తేదీ నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిం చారు. మండల వ్యవసాయాధికారి ఎ. జానకిరాములు నోడల్‌ అధికారిగా, గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రకాశ్‌ గ్రామస్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీ నుంచి జనవరి 19 వరకు ఆన్‌లైన్‌ చేయాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి నిర్వహించాలి. గ్రామంలో మొత్తం 780 దరఖాస్తులు రాగా, 578దరఖాస్తులను ఆన్‌లైన్‌ పూర్తి చేశారు. మి గిలిన 262దరఖాస్తులను వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేయకుండా బుట్టదాఖలు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆన్‌లైన్‌ కాని దరఖాస్తు దారులు ప్రభు త్వం అందిస్తున్న గృహజ్యోతి జీరో బిల్లులు, మహాలక్ష్మీ గ్యాస్‌సబ్సిడీతో పాటు ఇతర పథకాలకు వీరు అనర్హులయ్యారు. పలు మార్లు గ్రామ, మండలస్థాయి అఽధికారులకు గ్రామస్థులు సమస్యను విన్నవించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి గ్రామానికి రాగా ఆయనకు సైతం ఈ విషయంపై ఫిర్యాదు గ్రామస్థులు చేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్లికేషన్లను ఆన్‌లైన్‌ చేయ కుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు

సుమారు ఆరు నెలల క్రితమే మా గ్రామపంచాయతీలో కార్యదర్శికి దరఖాస్తులు ఇచ్చాం. ఆయన మా దరఖాస్తులు అన్‌లైన్‌ చేయలేదంటున్నారు. దీంతో మాకు జీరో కరెంట్‌ బిల్లులు, గ్యాస్‌ సబ్సిడీ రావట్లేదు. మళ్లీ దరఖాస్తు చేసు కోవా లని చెప్పడంతో మళ్లీ దరఖాస్తులు నింపి కార్యదర్శికి ఇచ్చాం.

కంచెర్ల గురవయ్య, రాజవరం గ్రామస్థుడు.

సమస్య కలెక్టర్‌కు నివేదించాం

రాజవరం గ్రామానికి చెందిన 262మంది ప్రజాపాలన దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయకపోవడం వాస్తవమే. గ్రామస్థుల ఫిర్యాదుతో కలెక్టర్‌కు నివే దించాం. వెబ్‌సైట్‌ ఫ్రీజ్‌ చేయడంతో ప్రస్తుతం దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయలేకపోతున్నాం. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాగానే ఆన్‌లైన్‌ చేస్తాం.

రమేష్‌, ఎంపీడీవో.

Updated Date - Jul 31 , 2024 | 12:11 AM