Share News

‘అభయ హస్తం’కు శివుడి పేరిట దరఖాస్తు

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:54 AM

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన ప్రజాపాలనలో అభయహస్తానికి ఓ వ్యక్తి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దానికి అధికారులు రశీదు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

‘అభయ హస్తం’కు శివుడి పేరిట దరఖాస్తు

ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదంటున్న దరఖాస్తుదారు

భీమదేవరపల్లి, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన ప్రజాపాలనలో అభయహస్తానికి ఓ వ్యక్తి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దానికి అధికారులు రశీదు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్‌రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తుదారుడి పేరు శివుడు, భార్య పేరు పార్వతీదేవీ, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని రాసి.. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కరెంటు బిల్లు.. పఽథకాల కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తులో శివుడి ఫొటో సైతం అంటించి, సంబంధిత అధికారికి సమర్పించాడు. అధికారులు దరఖాస్తు తీసుకున్నట్లు అతడికి రశీదు కూడా ఇచ్చారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసే క్రమంలో ఈ విషయం వెల్లడయింది. శివుడి పేరిట దరఖాస్తు సమర్పించిన సురేందర్‌ రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. దరఖాస్తు విషయం చర్చనీయాంశంగా మారడంతో తప్పును ఒప్పుకుంటూ ఎంపీడీవోకు సురేందర్‌ వినతి పత్రాన్ని అందజేశాడు. ‘‘గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజాపాలన గ్రామసభలో ఆలయ అభివృద్ధికి ఏమైన ప్రత్యేక నిధులు కేటాయిస్తారేమో అన్న ఉద్దేశంతో దరఖాస్తు చేశాను. అధికారులు, ప్రభుత్వంపై తప్పుడు ఉద్దేశంతో దరఖాస్తు చేయలేదు’’ అని తెలియజేశాడు.

Updated Date - Jan 08 , 2024 | 04:54 AM