రోడ్డెక్కిన అంగన్‌వాడీలు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:28 PM
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ హెల్పెర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

జీవో నెం.10ని రద్దు చేయాలంటూ అంగన్‌వాడీ టీచర్‌ల ధర్నా
కొడంగల్, జులై 5: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ హెల్పెర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం కొడంగల్‌లో సీఎం ఇంటి ముట్టడి పిలుపు మేరకు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తరలి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ శ్రీధర్‌రెడ్డి ఉదయం నుంచి సీఎం ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి అంగన్‌వాడీ టీచర్లను నిలువరించారు. దీంతో అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులు స్థానిక బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మీ, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ 65 సంవత్సరాలు పూర్తయినా అంగన్‌వాడీ హెల్పర్‌లు పది వేల మందికిపైగా పని చేస్తున్నారని తెలిపారు. జీవో నెం.10ని రద్దు చేస్తూ, రిటైర్మెంట్ సమయంలో టీచర్‌లకు రూ.2లక్షలు, హెల్పర్‌లకు రూ.1లక్ష చొప్పున అందించాలన్నారు. మొదటగా కొంత మంది అంగన్‌వాడీ హెల్పర్స్ ఆందోళన చేస్తుండగా వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన అంగన్‌వాడీలతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ధర్నా విరమింపజేసేందుకు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి పోలీసు సిబ్బందితో ప్రయత్నించినా వినలేదు. ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పోలీసుల అరెస్టులతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసులు అంగన్‌వాడీ టీచర్‌లు, ఆయాలను, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.