Share News

అంగన్‌వాడీ కోడిగుడ్లను కాల్చివేశారు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:43 PM

నాగారం గ్రామంలోని రైతు పొలంలో పారబోసిన కోడిగుడ్లను కాల్చివేసి ఆనవాళ్లు లేకుండా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంగన్‌వాడీ కోడిగుడ్లను  కాల్చివేశారు!
నాగారంలో పొలంలో అంగన్‌వాడీ కోడిగుడ్లను కాల్చివేసిన స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా అధికారి జ్యోతిపద్మ.

పొలంలో పారబోసిన కోడిగుడ్లపై అధికారుల విచారణ

దొరకని ఆనవాళ్లు.. కోడిగుడ్లు ఇక్కడివి కావు : ఐసీడీఎస్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

ధారూరు, మార్చి 4: నాగారం గ్రామంలోని రైతు పొలంలో పారబోసిన కోడిగుడ్లను కాల్చివేసి ఆనవాళ్లు లేకుండా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘పొలంలో అంగన్‌వాడీ కోడిగుడ్లు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్‌ అధికారులు స్పందించారు. సోమవారం ఘటనా ప్రాంతానికి శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారి జ్యోతి పద్మ, ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరమ్మ వెళ్లి పరిశీలించారు. సుమారు 600 వరకు పొలంలో పారవేసిన అంగన్‌వాడీ గుడ్లను అనవాళ్లు లేకుండా కాల్చివేయటంతో బూడిదగా మారాయి. దీంతో కోడిగుడ్లకు సంబంధించి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు 8 అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పారబోసిన కోడిగుడ్లు ఇక్కడివి కావని పేర్కొన్నారు. తాము అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పరిశీలించగా కోడిగుడ్ల లెక్కలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. కాగా కోడిగుడ్లను ఎవరు.. ఎందుకు కాల్చివేశారనే కోణంలో అధికారులు మాత్రం విచారించలేదని సమాచారం.

కోడిగుడ్ల పై జడ్‌-6(చార్మినార్‌ జోన్‌) గుర్తు

కాగా శనివారం పొలంలో పారవేసిన అంగన్‌వాడీ కోడిగుడ్లపై జడ్‌-6 అనే ముద్ర ఉంది. జోన్‌- 6 అంటే చార్మినార్‌ జోన్‌ కిందకు వస్తుందని ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో అంగన్‌వాడీ కోడిగుడ్లను ఇక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చారనేది అధికారులు తేల్చలేకపోయారు. విక్రయించటానికి తీసుకువచ్చి కోడి గుడ్ల పై ప్రభుత్వ ముద్ర ఉండటంతో పారబోశారనే ప్రచారం సాగుతుంది. ఈ వ్యవహారం బయటకు పొక్కటం, ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితం కావడంతో ఆనవాఽళ్లు లేకుండా కోడిగుడ్లను కాల్చివేయటంపై అధికారులు విచారణ చేయాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:43 PM