Share News

తూప్రాన్‌పేట పరిధిలోని పురాతన దిగుడుబావి

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:10 AM

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట జాతీయ రహదారి పక్కన ఉన్న పురాతన దిగుడు బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి అన్నారు.

తూప్రాన్‌పేట పరిధిలోని పురాతన దిగుడుబావి
బాటసారుల బావి

‘బాటసారుల బావి’ని బాగు చేసుకుందాం

మూడు శతాబ్దాల నాటి వాస్తు నైపుణ్యానికి నిదర్శనం

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

పురాశస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 27: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట జాతీయ రహదారి పక్కన ఉన్న పురాతన దిగుడు బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి అన్నారు. గురువారం దిగుడు బావిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలంసాయి బావి అని పిలిచే దిగుడు మెట్ల బావిని 17వ శతాబ్ది కాలంలో కుతుబ్‌షాహీ రాజులు బాటసారుల కోసం నిర్మించారని తెలిపారు. 19వ శతాబ్దిలో బావికి మరమ్మతులు చేసినట్టు అనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ రహదారికి 100 అడుగుల దూరంలో విజయవాడ వైపు దారిలో కుడి వైపున 70అడుగుల పొడవు, 45అడుగుల వెడల్పు, 50అడుగుల లోతుతో తవ్వించారని తెలిపారు. జాతీయరహదారి వైపు నుంచి బావి లోపలికి మెట్లు, మిగతా మూడు వైపుల రాతి గోడలు, మెట్లకు ఎదురుగా నీళ్లు తోడుకోవడానికి వ్యవసాయ అవసరాలకు వినియోగించడానికి మోటలను ఏర్పాటు చేశారని చెప్పారు. మూడు శతాబ్దాల చరిత్ర గల దిగుడు బావి అలనాటి వాస్తు నైపుణ్యానికి అద్దం పడుతోందని తెలిపారు. బావి చుట్టూ ఫెన్సింగ్‌, చారిత్రక వివరాలతో బోర్డును ఏర్పాటుచేసి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామస్థుడు చక్రం మల్లేష్‌ బావి సమాచారాన్ని తనకు అందించాడని తెలిపారు.

Updated Date - Jun 28 , 2024 | 12:10 AM