Share News

నామినేషన్‌ నుంచే అభ్యర్థులకు తోడుగా..

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:51 AM

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో కాంగ్రె్‌సను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అందుకోసం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు నామినేషన్‌ వేసే

నామినేషన్‌ నుంచే అభ్యర్థులకు తోడుగా..

రాష్ట్రంలో నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌/మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో కాంగ్రె్‌సను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అందుకోసం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయం నుంచే వారికి అండగా ఉండేందుకుగాను నామినేషన్‌ దాఖలు కార్యక్రమాలకు కూడా హాజరు కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. శుక్రవారం మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, బలరాం నాయక్‌ల నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తొలుత మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆయనతో కలిసి సీఎం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళతారు. అనంతరం మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌ చౌరస్తాలో నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు వెళ్లి.. అక్కడి అభ్యర్థి బలరాంనాయక్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ములుగులో ఏర్పాటు చేసే ప్రచార సభలో పాల్గొంటారు. శనివారం మెదక్‌లో పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్‌ హాజరవుతారు. అక్కడ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి బెంగుళూరుకు వెళ్లి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి తెలంగాణకు చేరుకొని.. 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో బహిరంగ సభల్లో పాల్గొంటారు.

అధికార ప్రతినిధుల నియామకం...

పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు స్థానికంగా మీడియాకు అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులను నియమించింది. రాష్ట్ర స్థాయిలో రియాజ్‌, రామిశెట్టి నరేందర్‌, లింగంయాదవ్‌తోపాటు మీడియా కో-ఆర్డినేటర్‌లుగా వచన్‌కుమార్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, మామిడి గోపి, కమలాకర్‌ మెడగోని, తుమ్మల పద్మ, అజ్మీర గణేష్‌ నాయక్‌లను నియమించినట్టు టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 04:51 AM