Share News

ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములివ్వం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:38 PM

ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములు ఇచ్చేదే లేదని, ఈ విషయంలో అధికారులు బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని రైతులు హెచ్చరించారు.

ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములివ్వం

బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటాం

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండల రైతుల హెచ్చరిక

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిపై దాడికి యత్నం.. పరిస్థితి ఉద్రిక్తం

రైతులను సముదాయించిన అదనపు కలెక్టర్‌, ఎస్పీ

లగచర్లలో భూ సేకరణ సమావేశాన్ని రద్దు చేసిన అధికారులు

బొంరాస్‌పేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములు ఇచ్చేదే లేదని, ఈ విషయంలో అధికారులు బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని రైతులు హెచ్చరించారు. శుక్రవారం కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో భూ సేకరణ కోసం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దుద్యాల కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్‌ హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం లగచర్లకు బయలుదేరగా మార్గమధ్యలో రోటిబండ తండా వద్ద పోలీసులు వాహనాన్ని ఆపారు. కారు దిగిన శేఖర్‌ తండావాసులతో మాట్లాడుతుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న పులిచర్ల కుంట, రోటిబండ తండా, పోలెపల్లి, హకీంపేట్‌ భూ నిర్వాసితులు ఆయనపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు, మహిళలు శేఖర్‌ను గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి దాచిపెట్టారు. భూ నిర్వాసితులు అక్కడికి చేరుకోగా.. పోలీసులు సముదాయించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో కొందరు యువకులు, రైతులు రాళ్లను గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉన్న రేకులపై విసిరారు. హైమాస్ట్‌ దీపాల కోసం ఏర్పాటు చేసిన స్తంభాన్ని తీసుకెళ్లి కార్యాలయం షట్టర్‌ను విరగొట్టే ప్రయత్నం చేశారు. పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్సైలు అబ్దుల్‌ రవూఫ్‌, శంకర్‌లు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీఎస్పీతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించారు. అయినా వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న శేఖర్‌ను బయటకు తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు.. రైతులు అదనపు కలెక్టర్‌, జిల్లా ఎస్పీతో మాట్లాడుతూ.. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అప్పటికే ఆర్బీ తండాకు చెందిన సేవ్యానాయక్‌ అనే రైతు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు వారించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి రైతులను సముదాయించారు. ఈ సంఘటనతో అధికారులు లగచర్ల గ్రామంలో భూ సేకరణ సమావేశాన్ని రద్దు చేశారు.

Updated Date - Oct 25 , 2024 | 11:38 PM