Share News

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:49 AM

ఔటర్‌ రింగు రోడ్డుకు ఆవల నిర్మించే రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌

నంది అవార్డులపై కేబినెట్‌లో నిర్ణయం: కోమటిరెడ్డి

ఆర్‌ అండ్‌ బీ శాఖకు సరిపడా నిధులిస్తాం: భట్టి

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగు రోడ్డుకు ఆవల నిర్మించే రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలైన్‌మెంట్‌ విషయంలో పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చూస్తామన్నారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... ఇష్టం వచ్చినట్లు కాకుండా క్రమపద్ధతిలో, పజల అవసరాలకు అనుగుణంగా, ఆమోదయోగ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీని భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, నల్లగొండ, హైదరాబాద్‌లలో కలెక్టరేట్ల నిర్మాణాలు, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి నిధులివ్వాలని కోమటిరెడ్డి, డీప్యూటీ సీఎంను కోరారు. గత ప్రభుత్వం కాగితాలపై కేటాయింపులు చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, పది సార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని కోమటిరెడ్డి వివరించారు. రోడ్లు భవనాల శాఖకు సరిపడా నిధులిస్తామని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలకు కూడా నిధులు కేటాయిస్తామని మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ నటీ నటులకు అందజేసే నంది ఆవార్డులపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ సినిమా హాళ్లలో అమ్ముతున్న చిరుతిళ్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jan 21 , 2024 | 08:48 AM