Share News

యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:59 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనృసింహుడికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ
తిరువీధుల్లో లక్ష్మీనృసింహుల అలంకార జోడు సేవలను ఊరేగిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జనవరి 30: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనృసింహుడికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి చెంత ఆంజనేయస్వామిని అర్చకస్వాములు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసి సింధూరం, వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్యతిరుకల్యాణం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన అనుబంధ ఆలయమైన శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్ఫటిక మూర్తులకు నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. అనుబంధ పాతగుట్ట ఆలయంలో పుష్కరిణి, ప్రధానాలయంలోని, కొండపైన శివాలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.20,09,970 ఆదాయం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:59 PM