Share News

ఎయిర్‌పోర్టులను తలదన్నేలా రైల్వేస్టేషన్లు

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:27 AM

విమానాశ్రయాలను తలదన్నే ప్రమాణాలతో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు.

ఎయిర్‌పోర్టులను తలదన్నేలా రైల్వేస్టేషన్లు

దేశంపై మోదీ ప్రేమకు నిదర్శనం: తమిళిసై

అభివృద్ధి పనులకు సహకరిస్తాం: భట్టి

రాష్ట్రంలోని15 రైల్వేస్టేషన్లలో 231కోట్లతో

పనులు.. వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విమానాశ్రయాలను తలదన్నే ప్రమాణాలతో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌(ఏబీఎస్‌) పథకం రెండో విడతలో భాగంగా దేశంలోని 554 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లలో రూ.231కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు మార్గాల్లో రూ.490కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, రైల్వే అండర్‌ బ్రిడ్జిలను ప్రారంభించారు. ఈ మేరకు బేగంపేట రైల్వే స్టేషన్‌లో రూ.22.57కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలో గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంప్రదాయక వ్యవస్థలను మెరుగు పరిచేందుకు ప్రధాని మోదీ సంకల్పించడం ఆయనకు దేశంపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందన్నారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంతో రేడియోను, వందే భారత్‌ రైళ్ల ద్వారా రైల్వే వ్యవస్థను, అనేక కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు పోస్టాఫీసులను ప్రధాన మంత్రి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద రాష్ట్రంలోని బేగంపేట్‌, యాకుత్‌పుర సహా 15 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం శుభపరిణామమని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ అతి పెద్ద రవాణా నెట్‌వర్క్‌గా పేరుగాంచిన భారతీయ రైల్వే.. అతి తక్కువ చార్జీలతో కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని అన్నారు. సరకు రవాణాతో దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతోందన్నారు. తెలంగాణలో రైల్వే శాఖ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించే ఈ సందర్భం చరిత్రాత్మకమని అన్నారు. సమాజం, దేశ పురోగతి కోసం రైలు, రోడ్డు మార్గాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని వివరించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ భారతీయ రైల్వేలో వేగవంత మార్పునకు ప్రస్తుత శంకుస్థాపనలు నాంది పలుకుతాయని అన్నారు. జోన్‌ పరిధిలో నిర్మించిన 57కొత్త రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా యాకుత్‌పురాలో రూ.31.1కోట్లు, వ రంగల్‌లో రూ.25.41కోట్లు, పెద్దపల్లిలో రూ.26.49 కోట్లు, మెదక్‌లో రూ.15.31కోట్లు, షాద్‌నగర్‌లో రూ.9.59కోట్లతో పనులు చేపట్టనున్నారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్లలో ప్రత్యేకతలివే..

సౌందర్యకరమైన, ఆహ్లాదకరమైన ప్రవేశ ద్వారం

స్టేషన్‌ పరిసరాలను మెరుగుపరిచేందుకు రోడ్ల విస్తరణ

పాదచారుల మార్గాలు, ప్రణాళికాబద్ధ పార్కింగ్‌ ప్రాంతాలు

మెరుగైన లైటింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌, గ్రీన్‌ ప్యాచ్‌ల ఏర్పాటు

‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ కోసం ప్రత్యేక స్టాళ్లు

సర్క్యులేటింగ్‌ ఏరియా కోసం రెండో ప్రవేశ ద్వారం

తగినన్ని ఉన్నత స్థాయి ప్లాట్‌ఫారాలు, షెల్టర్లు

ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులు, యూజర్‌ ఫ్రెండ్లీ సదుపాయాలు

Updated Date - Feb 27 , 2024 | 10:57 AM