Share News

వైద్య ఆరోగ్యశాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా..!

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:39 AM

వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా మొదలైంది..! వర్క్‌ఆర్డర్లను రద్దుచేస్తూ ఈ నెల 7న వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన ఉత్తర్వులు జిల్లా వైద్యాధికారుల(డీఎంహెచ్‌వో)కు వరంగా మారింది.

వైద్య ఆరోగ్యశాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా..!

వరంగా మారిన సర్కారు ఆదేశాలు

గతంలో విభాగఅధిపతులకే అధికారం

తాజా ఆదేశాలతో డీఎంహెచ్‌వోలకు..

అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డీఎంహెచ్‌వోలు

ఒక్కొక్కరి నుంచి 1-2 లక్షల వరకు వసూలు

డిప్యుటేషన్‌ రద్దయిన 60% మంది మళ్లీ వెనక్కి!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా మొదలైంది..! వర్క్‌ఆర్డర్లను రద్దుచేస్తూ ఈ నెల 7న వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన ఉత్తర్వులు జిల్లా వైద్యాధికారుల(డీఎంహెచ్‌వో)కు వరంగా మారింది. ఆ ఉత్తర్వుల్లోని ఒక చిన్న అంశాన్ని అడ్డుపెట్టుకుంటున్న కొందరు డీఎంహెచ్‌వోలు.. డిప్యూటేషన్ల దందాకు తెరతీసి, లక్షల రూపాయలను వెనకేసుకునేందుకు సిద్ధమయ్యారు. సర్కారు జీవోలో ‘‘వైద్య సేవలకు అంతరాయం కలిగే పరిస్థితుల్లో జిల్లా స్థాయిలోనే డిప్యుటేషన్లు, వర్క్‌ ఆర్డర్లను ఇచ్చుకోవచ్చు. అయితే.. దానికి సంబంధిత జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి’’ అని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని, డిప్యుటేషన్లు రద్దయినా.. 60ు మంది అదే స్థానంలో తిష్టవేసేలా కొందరు డీఎంహెచ్‌వోలు దందా మొదలు పెట్టారని వైద్యఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

‘అత్యవసరం’ పేరుతో..

జిల్లా స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో డిప్యుటేషన్స్‌ అఽధికారాన్ని తాజా జీవో డీఎంహెచ్‌వోలకు కట్టబెట్టింది. బీఆర్‌ఎస్‌ హయాంలోనూ ఇదే పద్ధతి ఉండేది. కొందరు డీఎంహెచ్‌వోలు ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్స్‌ ఇచ్చేశారు. దాంతో గత సర్కారు వారి అధికారాలకు కత్తెర వేస్తూ.. ఆ బాధ్యతలను రాష్ట్రస్థాయి విభాగాధిపతుల(హెచ్‌వోడీల)కే కట్టబెట్టింది. జీవో నంబరు 317లో నష్టపోయిన వారి విషయంలో గత సర్కారు డిప్యుటేషన్లకు అవకాశమిచ్చింది. కొత్త సర్కారు వాటిని రద్దుచేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని నెలరోజులు కూడా గడవక ముందే.. ఈ నెల 7న జారీ అయిన జీవోను కొందరు డీఎంహెచ్‌వోలు వరంగా మార్చుకున్నారు. ‘అత్యవసరం’ పేరిట ఇప్పటికే పాతుకుపోయిన వారితో పాటు.. అస్మదీయులను కీలక పోస్టుల్లోకి తీసుకువచ్చేందుకు డిప్యుటేషన్స్‌ను ఆయుధంగా వాడుతున్నారు. డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎమ్‌లు, సెకండ్‌ ఏఎన్‌ఎమ్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు ఇలా హోదాను బట్టి.. డిప్యుటేషన్లు ఓకే చేయించేందుకు కొందరు డీఎంహెచ్‌వోలు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వైద్య ఆరోగ్యశాఖలో వెల్లువెత్తుతున్నాయి.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు..

సర్కారు గత నెలలో తీసుకున్న నిర్ణయంతో.. ఉత్తర తెలంగాణలోని ఓ ఏజెన్సీ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న 26 మంది డిప్యుటేషన్లు రద్దయ్యాయి. అయినా.. వారు పాత స్థానంలోనే పనిచేస్తున్నారు.ఇప్పుడు వారందరి డిప్యుటేషన్లను ‘అత్యవసరం’ పేరిట జిల్లా కేంద్రంలోనే కొనసాగించేందుకు స్థానిక డీఎంహెచ్‌వో సిద్ధమయ్యారు. ఒక్కొక్కరి నుంచి ముడుపులు అందాక.. వారి జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపారు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లా డీఎంహెచ్‌వో ఏకంగా సెకండ్‌ ఏఎన్‌ఎమ్‌లను తన కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించుకునేందుకు ఓ జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపారు. సింహభాగం జిల్లాల్లో ఇదే దందా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధిత డీఎంహెచ్‌వోల నుంచి 50 దాకా పేర్లు చేరినట్లు వైద్యఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పలు జాబితాలు కలెక్టర్లకు చేరాల్సి ఉన్నట్లు సమాచారం.

జోనల్‌ పోస్టులకూ డిప్యుటేషన్లు?

నిబంధనల ప్రకారం జోనల్‌ స్థాయి పోస్టులకు డిప్యుటేషన్‌ ఇచ్చే అధికారం జిల్లా అధికారులకు ఉండదు. అయితే.. సర్కారు తాజా జీవో మాత్రం ఆ అధికారాన్ని కూడా డీఎంహెచ్‌వోలకు దఖలుపరుస్తోంది. కలెక్టర్‌ అనుమతితో జోనల్‌ స్థాయి పోస్టులకు కూడా డిప్యుటేషన్‌ ఇచ్చేందుకు కొందరు డీఎంహెచ్‌వోలు సిద్ధమయ్యారు. నిజానికి కొత్త ప్రభుత్వం డిప్యుటేషన్లు, వర్క్‌ఆర్డర్లను రద్దు చేయడానికి కూడా ఈ డీఎంహెచ్‌వోల ఒత్తిడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి, కాసుల దందాకు తెరతీసేలా కొత్త జీవోను తెప్పించారనే చర్చ వైద్య ఆరోగ్యశాఖలో కొనసాగుతోంది.

Updated Date - Feb 26 , 2024 | 05:39 AM