అంతా అయిపోయాక.. బడిబాట పట్టేవారేరీ!
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:32 PM
ఆకులు రాలాక.... చేతులు పట్టుకున్నట్లుగా ఉంది విద్యాశాఖ అధికారుల తీరు. విద్యార్థులంతా ప్రైవేటు బాట పట్టిన తర్వాత తాపీగా విద్యాశాఖ అధికారులు బడిబాట పట్టడం వల్ల ఉపయోగ ం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ప్రైవేటు బాట పట్టిన పిల్లలు
తాపీగా విద్యాశాఖ బడిబాట ప్రారంభం
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
మేడ్చల్ జూన్ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఆకులు రాలాక.... చేతులు పట్టుకున్నట్లుగా ఉంది విద్యాశాఖ అధికారుల తీరు. విద్యార్థులంతా ప్రైవేటు బాట పట్టిన తర్వాత తాపీగా విద్యాశాఖ అధికారులు బడిబాట పట్టడం వల్ల ఉపయోగ ం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజులుగా మండు టెండలో సైతం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు ఇంటింటి ప్రచారం చేస్తూ వారి పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, వసతులు, ఉపాధ్యాయుల సీనియార్టీ, సాధించిన ఫలితాలు, కరపత్రాలతో విస్త్రతంగా ప్రచారం నిర్వహించి అడ్మిషన్లు సాధించారు. ఒకటికి నాలుగు సార్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను చేర్పించేంత వరకు వదిలిపెట్టలేదు. దూర ప్రాంతాల నుంచి రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. కొత్తగా కంప్యూటర్ విద్య ప్రవేశపెడుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికే అటువైపు మొగ్గు చూపారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలతో పాటు కార్పొరేట్ పాఠశాలలు చేరవయ్యాయి. మూడేళ్లు నిండిన చిన్నారులను ఎల్‌కేజీ, యూకేజీలలో చేర్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చక్కబెట్టుకున్న తర్వాత ప్రస్తుతం విద్యాశాఖ వారు బడిబాట ప్రారంభించారు. బడిబాట కార్యక్రమం పెట్టినా గత ఐదారు సంవత్సరాలుగా పిల్లలను చేర్పించింది నామమాత్రమే.
బడిబాట కార్యక్రమాలు...
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట మొదలు పెట్టిన రోజు గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘ సభ్యులు సమావేశమై కార్యక్రమంపై చర్చించి పిల్లలను బడిలో చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ర్యాలీ నిర్వహిస్త్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలి. రెండో రోజు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి బడీడు పిల్లలు ఉంటే బడిలో చేర్పించాలని ఒప్పించి చేర్పించాలి. పిల్లలను గుర్తించి రికార్డులో పొందుపర్చాలి. తర్వాత 8,9 తేదీల్లో ఇంటింటి ప్రచారంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి బడికి వెళ్లే వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ బడిలో చేర్పించేలా ఒప్పించాలి. కరపత్రాలు, బ్రోచర్లు తయారు చేసి ప్రభుత్వ బడిలో చేరితే ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, వసతులు, ఏకరూప దుస్తులు , పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు, సౌకర్యాలను వివరించాలి. 11న గ్రామ సభ నిర్వహించి బడిబాటలో చేసిన కార్యక్రమాలు, బడి బయట ఉన్న వారి వివరాలు, డ్రాప్ అవుట్‌ల గురించి వివరించాలి. 11లోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 12న బడి ప్రారంభోత్సవం సందర్భంగా అలంకరణతో స్వాగతం పలకాలి.