Share News

పీఎం జన్‌మన్‌ కింద ఆదివాసీలకు పక్కా ఇళ్లు: మోదీ

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:38 AM

దేశంలోని గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

పీఎం జన్‌మన్‌ కింద ఆదివాసీలకు పక్కా ఇళ్లు: మోదీ

తొలి విడతగా రూ.540 కోట్లు విడుదల

అచ్చంపేట/మన్ననూరు, జనవరి 16 : దేశంలోని గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పీఎం-జన్‌మన్‌(ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌) ద్వారా ఆదివాసీలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా లక్ష మంది పీఎంఏవై-జీ(ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ్‌) లబ్ధిదారులకు పఎం జన్‌మన్‌ కింద తొలి విడతగా రూ.540 కోట్లను ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న జన్‌మన్‌ లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌ ఆదివాసీ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి జిల్లాకు చెందిన ఆదివాసీ చెంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పీఎం జన్‌మన్‌ ద్వారా ఆదివాసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రూ.24వేల కోట్లు కేటాయించామని చెప్పారు. జన్‌మన్‌ కింద తొలి విడతగా రూ.540 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వచ్చే దీపావళిలోగా సొంతిల్లు లేని ఆదివాసీలు ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారుని ఖాతాలో రూ.2.50 లక్షలు జమ చేస్తామని వివరించారు. కాగా, జన్‌మన్‌ పథకం కింద ఎంపిక చేసిన పలువురు ఆదివాసీలకు కొత్త ఆధార్‌ కార్డులు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, కులధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 07:22 AM