Share News

అదనపు అప్పు పుట్టేనా!?

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన అదనపు అప్పుపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఈ నెల 9న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిర్వహించే ఈ-వేలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడం లేదు.

అదనపు అప్పు పుట్టేనా!?

వెయ్యి కోట్ల అప్పుకే అనుమతి ఇవ్వని కేంద్రం

9న ఆర్‌బీఐ ఈ-వేలానికి రాష్ట్రం దూరం

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన అదనపు అప్పుపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఈ నెల 9న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిర్వహించే ఈ-వేలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడం లేదు. 2023-24 బడ్జెట్‌లో రూ.40,615 కోట్ల అప్పును ప్రతిపాదించిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... డిసెంబరు నాటికే రూ.39,051 కోట్ల అప్పును తీసుకుంది. దీంతో చివరి త్రైమాసికం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో రూ.1,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం... అదనపు అప్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తోంది. చివరి త్రైమాసికంలో రూ.13వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ.. కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు.. బహిరంగ మార్కెట్‌ రుణాల కోసం మంగళవారం(9న) ఆర్‌బీఐ నిర్వహించే వేలం పాటలో పాల్గొనేందుకు దేశంలోని 8రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కలిపి రూ.19,330కోట్ల అప్పులకు ఇండెంట్లు పెట్టాయి. అయితే, కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టలేకపోయింది. అందుకే సెక్యూరిటీ బాండ్లను కూడా విడుదల చేయలేదు. కానీ...ఈ నెలలో ఎప్పుడైనా కేంద్రం నుంచి అనుమతి లభించవచ్చని అధికారవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎంత మేర అప్పు తీసుకోవాలో నిర్ణయించుకుని ఇండెంట్లు పెడతామని చెబుతున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 07:35 AM