Share News

పార్లమెంట్‌ స్థాయి జిల్లా ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:31 PM

పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

పార్లమెంట్‌ స్థాయి జిల్లా ఏర్పాటుకు చర్యలు
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి, జనవరి 8: పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పరిగి మండల పరిషత్‌లో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజనలో వికారాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పార్లమెంట్‌ స్థాయి జిల్లా అయితే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల ఏర్పాటు కోసం సిట్టింగ్‌ లేదా రిటైర్టు జడ్జిలతో కమిషన్‌ వేయబోతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వలేదని, జిల్లా వ్యాప్తంగా రూ.500ల కోట్ల పనులకు పెండింగ్‌ బిల్లులు రావాల్సి ఉందన్నారు. సర్పంచులు ఆందోళన చెందరాదని, అందరి బిల్లులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు పూర్తయినవి, కొనసాగుతున్నవి, ఇంకా ప్రారంభించని పనుల వివరాలు నివేదికను తీసుకుని, ఆ దిశగా నిధుల మంజూరికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేలైను నిర్మాణం రీ సర్వేకోసం ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.పూడూరులో కూ,2500ల కోట్లతో నేవీ రాడార్‌ ప్రాజెక్టు పనులు కూడా చేపట్టబోతున్నామని తెలిపారు. నేవీరాడార్‌ ప్రాజెక్టు దగ్గర ఇంటర్నేషనల్‌ స్థాయి స్కూల్‌ పెడతామని, అందులో 50 శాతం స్థానికులు రిజర్వేషన్‌లు ఉంటాయని తెలిపారు. పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్లుగా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీసీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, కె.సత్యనారాయణ, శేషగిరిశర్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:31 PM