Share News

గీతారెడ్డి మంత్రివర్గంలో లేకపోవడం పెద్ద లోటు

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:53 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి తన మంత్రివర్గంలో లేకపోవడం పెద్ద లోటు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

గీతారెడ్డి మంత్రివర్గంలో లేకపోవడం పెద్ద లోటు

కాంగ్రెస్‌ను ఆమె ఎంతో బలోపేతం చేశారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో పోరాడారు

ఈశ్వరీబాయి గొప్ప యోధురాలు: రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి తన మంత్రివర్గంలో లేకపోవడం పెద్ద లోటు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గీతారెడ్డి తనకు పెద్దక్క అని, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల నిర్వహణలో తోబుట్టువులా అండగా నిలిచారని తెలిపారు. ప్రధానంగా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆమె క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గీతారెడ్ది చేపట్టిన ఆందోళనలు, కార్యక్రమాలు పార్టీని మరింత బలోపేతం చేశాయని కొనియాడారు. గీతారెడ్డి పార్టీ ఇన్‌చార్జిగా నిర్వహించిన నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు కాంగ్రె్‌సకు దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. తాను సోనియాగాంధీని కలిసిన ప్రతిసారీ గీతారెడ్డి ఎలా ఉన్నారంటూ అడుగుతారని తెలిపారు. సామాజిక ఉద్యమకారిణి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి 33వ వర్ధంతి సభను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై.. ఈశ్వరీబాయికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల కిందట ప్రజా జీవితాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రను చాటిన గొప్ప యోధురాలు ఈశ్వరీబాయి అని కొనియాడారు.

తొలిదశ తెలంగాణ పోరాటంలో ఆమె పాత్రను ప్రస్తావిస్తూ శ్లాఘించారు. ఈశ్వరీబాయి కుమార్తె గీతారెడ్డి రాజకీయ, సామాజిక, వైద్య రంగాల్లో రాణించారని, ఇందుకు అడుగడుగునా ప్రోత్సహిస్తూ, వెన్నుదన్నుగా నిలిచిన ఆమె భర్త డాక్టర్‌ రామచంద్రారెడ్డి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, గీతారెడ్డి దంపతులతోపాటు పలువురు దళిత, బహుజన ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. మళ్లీ రాని మంత్రులు..కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్‌ తదితరులు హైదరాబాద్‌కు వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు తాను విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉందని, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ప్రకటించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లిపోయారు. అయితే ఆయన వెంటే వెళ్లిన మంత్రులు తిరిగి రాలేదు. దాంతో జహీరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈశ్వరీబాయి సాగించిన ప్రత్యేక తెలంగాణ, సామాజిక పోరాటాల జీవితం ఇతివృత్తంగా రూపొందించిన లఘు చిత్రాన్ని సభలో ప్రదర్శించారు.

Updated Date - Feb 25 , 2024 | 07:44 AM