Share News

రిజర్వేషన్ల రద్దు.. పెద్ద అబద్ధం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:56 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ రద్దు అన్నది దశాబ్దంలోనే అతి పెద్ద అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల రద్దు.. పెద్ద అబద్ధం

కాంగ్రెస్‌ పార్టీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది

కేంద్ర మంత్రి షా ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారు

అబద్ధాలే కాంగ్రెస్‌ గ్యారెంటీ: జి.కిషన్‌రెడ్డి

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం

‘మత’ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్సే

మేం అధికారంలోకి రాగానే రద్దు: బండి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ రద్దు అన్నది దశాబ్దంలోనే అతి పెద్ద అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సిద్దిపేటలో చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ మార్ఫింగ్‌ చేసిందని చెప్పారు. ఆ పార్టీ దిగజారుడుతనానికి ఇది పరాకాష్ఠ అని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అమిత్‌ షా వీడియోను మార్ఫింగ్‌ చేయడం ద్వారా కొన్ని వర్గాలను భయభ్రాంతులను చేసేందుకు, కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనకు, మోదీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. అవినీతి విషయంలో ప్రధాని మోదీని తప్పు పట్టే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. దీంతో, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తుందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. అబద్ధాలే కాంగ్రెస్‌ గ్యారెంటీలని విమర్శించారు.

కాంగ్రెస్‌ బీసీలను అణచివేస్తోంది: లక్ష్మణ్‌

కాంగ్రెస్‌ మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం బాగ్‌ అంబర్‌పేటలో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీసీల కులవృత్తులను బీజేపీ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

కాంగ్రె్‌సకు ఓటమి భయం: సంజయ్‌

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ విష ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఇంటింటా బీజేపీ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు వద్దన్న మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి కాంగ్రెస్‌ పేదల పొట్ట కొట్టిందని అన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి పేదలకు పంచుతామని తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్‌ ప్రకటిస్తే కాంగ్రెస్‌ కనీసం నోరు మెదపలేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రె్‌సపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయంతోనే బీజేపీపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లేనిపోని విమర్శలు చేస్తున్నాయని సంజయ్‌ తెలిపారు.

నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటు సెగ్మెంటు పరిధిలోని నిజాంపేటలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొంటారు. మాజీ గవర్నర్‌ తమిళి సై సోమవారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

30న మెదక్‌ జిల్లాలో మోదీ సభ

ఈ నెల 30న మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించనున్న జన సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆదివారం సభా ప్రాంగణాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పరిశీలించారు.

బీజేపీలోకి పెద్దిరెడ్డి..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేడో, రేపో బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రెండుసార్లు హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముందు బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరారు.

Updated Date - Apr 29 , 2024 | 04:56 AM