అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
ABN , Publish Date - Aug 28 , 2024 | 06:44 AM
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏఐసీసీ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరఫున టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్.. మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. కాంగ్రె్‌సలో
తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభలోకి
హైదరాబాద్, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏఐసీసీ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరఫున టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్.. మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. కాంగ్రె్‌సలో చేరిన కె.కేశవరావు.. బీఆర్‌ఎస్ నుంచి సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ఈ నెల 19న నామినేషన్ వేశారు. శాసనసభలో ప్రాతినిథ్యం కలిగి ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం సహా ఏ పార్టీ నుంచీ నామినేషన్ దాఖలు కాలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఓ వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినా.. స్ర్కూటినీలో ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదంతో అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీఆర్‌ఎస్ మరో సిటింగ్ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఫిబ్రవరిలో తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. సంఖ్యా బలాన్ని బట్టి రెండు సీట్లు కాంగ్రెస్‌కు, ఒక సీటు బీఆర్‌ఎ్‌సకు దక్కాయి. కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్.. బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, సంతో్‌షకుమార్, వద్దిరాజు రవిచంద్రల సభ్యత్వాల గడువు ముగియడంతో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో రవిచంద్ర సీటును నిలబెట్టుకున్న బీఆర్‌ఎస్.. లింగయ్య, సంతోష్ సీట్లను కోల్పోయింది. ఈ 2సీట్లతో పాటుగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నికతో మొత్తం మూడు బీఆర్‌ఎస్ సిటింగ్ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.\
రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవం
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో మంగళవారం 12 మంది పోటీ లేకుండా నెగ్గారు. వీరిలో తొమ్మిది మంది సభ్యులు కావడం గమనార్హం. మరో ఇద్దరు ఎన్‌డీఏ కూటమి సభ్యులు కాగా, మరొకరు కాంగ్రెస్ అభ్యర్థి. ఎన్‌డీఏ కూటమికి చెందిన ఎన్‌సీపీ (అజిత్ పవార్), రాష్ట్రీయ లోక్ మంచ్‌కు చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఎన్‌డీఏ మెజార్టీ మార్కును చేరుకున్నట్టయింది. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల బలం 237 కాగా, మెజార్టీ సాధించాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. నామినేటెడ్ సభ్యులతో కలిపి ఎన్‌డీఏ ఈ సంఖ్యను చేరుకుంది. తాజాగా బీజేపీ సొంత బలం 96కు చేరుకుంది. మిత్రపక్షాలైన ఎన్‌డీఏ కూటమిని లెక్కిస్తే సభ్యుల బలం 112 అవుతుంది. ఆరుగురు నామినెట్ సభ్యులు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడుని కలుపుకొంటే మొత్తం బలం 119కు చేరుకుంటుంది. మరోవైపు విపక్షాల బలం 85కు చేరింది.