Share News

బ్యారేజీల డిజైన్లపై తలో మాట

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:18 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఎదుట సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో), ప్రాజెక్టు నిర్మాణ విభాగం, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం), నిర్మాణ సంస్థల అధికారులు గురువారం తలో మాట మాట్లాడారు.

బ్యారేజీల డిజైన్లపై తలో మాట

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై ఎన్‌డీఎస్‌ఏ విచారణ..

ఐఎస్‌ కోడ్‌తో రూపొందినవే ఆమోదించాం: సీడీవో

వైఫల్యానికి మేం బాధ్యులం కాదు: నిర్మాణ సంస్థలు

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఎదుట సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో), ప్రాజెక్టు నిర్మాణ విభాగం, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం), నిర్మాణ సంస్థల అధికారులు గురువారం తలో మాట మాట్లాడారు. ఎన్‌డీఎ్‌సఏ కమిటీ జల సౌధలో ఉదయం 9:30 నుంచి రాత్రి దాకా విచారణ చేపట్టింది. ‘‘డిజైన్లకు ప్రామాణికత ఏమిటి? దేనిని ఆధారం చేసుకుని వాటిని రూపొందించారు? ఇందులో ఎవరి సహకారమైనా తీసుకున్నారా? బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లారా? కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు పాటించారా?’’ అంటూ ప్రశ్నలతో ముంచెత్తింది. డిజైన్లకు సంబంధించి 9 అంశాలతో ప్రశ్నపత్రం ఇచ్చి వివరాలు సేకరించింది. కాగా, భారత ప్రమాణాల (ఐఎస్‌) కోడ్‌ ఆధారంగా డి జైన్లు రూపొందించారని, వాటినే ఆమోదించామని సీడీవో అధికారులు జవాబిచ్చారు. మూడు బ్యారేజీల అసలు డిజైన్లు అందించాలని ఎన్‌డీఎ్‌సఏ కోరగా.. వాటిని విజిలెన్స్‌ తీసుకెళ్లిందని చెప్పారు. మేడిగడ్డ డిజైన్లను నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీనే తయారుచేసిందని, వాటినీ ఐఎస్‌ ప్రకారం ఆమోదించామని తెలిపారు. మెయిల్‌ ద్వారా ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పంపిన డిజైన్లను ఎన్‌డీఎ్‌సఏ కమిటీకి అందించారు. నిర్మాణంలో కటాఫ్‌ పైల్స్‌కు బదులుగా సీకంట్‌ పైల్స్‌ ఎందుకు వాడారు? అని అడగ్గా, డిజైన్ల తయారీ వరకే తమ బాధ్యత అని, నిర్మాణం ఏ విధంగా జరుగుతోందని పరిశీలించే అధికారం లేదని, సమస్యలు వస్తే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లబోమని సీడీవో అధికారులు బదులిచ్చారు. కాగా, మూడు బ్యారేజీలను సీడీవో అందించిన డిజైన్లు/డ్రాయింగ్‌ ఆధారంగానే కట్టామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఎన్‌డీఎ్‌సఏకు వివరణ ఇచ్చారు. బ్యారేజీల వైఫల్యానికి తాము బాధ్యులం కాదని, ప్రభుత్వం ఏ విధంగా డిజైన్లు ఇచ్చిందో అలాగే నిర్మించామని స్పష్టం చేశారు.

వానలకు ముందు, తర్వాత తనిఖీ చేశారా?

డ్యామ్‌ భద్రతా చట్టం, ఐఎస్‌ కోడ్‌ ప్రకారం వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను పరిశీలించారా? అని ఓఅండ్‌ఎం విభాగాన్ని ఎన్‌డీఎ్‌సఏ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణం 2019 జూలైలో పూర్తయిందని, తర్వాత రెండేళ్ల పాటు డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌లో ఉన్నాయని తెలిపారు. 2021 నుంచి 2024 దాకా బ్యారేజీల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని నీటి పారుదల శాఖ ఓఅండ్‌ఎం అధికారులు గుర్తుచేశారు. అలాగైతే 2019 నుంచి ఓఅండ్‌ఎంతో ముడిపడిన నివేదికలు ఇవ్వాలని ఎన్‌డీఎ్‌సఏ కోరింది. కాగా, నిపుణుల కమిటీ పర్యటన శుక్రవారంతో ముగియనుంది. స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(ఎ్‌సడీఎ్‌సవో) అధికారులతో సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ ల్యాబోరేటరీ (టీఎ్‌సఈఆర్‌ఎల్‌)ని సందర్శించనుంది. రాష్ట్రంలో ఏ బ్యారేజీ/డ్యామ్‌ కట్టాలన్నా నమూనా డ్యామ్‌/బ్యారేజీలను కట్టి ఇక్కడే పరీక్షిస్తారు. అనంతరం ఎన్‌డీఎ్‌సఏ బృందం ఢిల్లీకి తిరిగివెళ్లనుంది.

నాణ్యత పరిశీలించాకే సంతకాలు పెట్టారా?

బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, పరీక్షల తర్వాతే సంతకాలు చేశారా? లేక ముందే చేశారా? అని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను ఎన్‌డీఎ్‌సఏ ప్రశ్నించింది. 2016లో నిర్మాణం ప్రారంభిస్తే మూడేళ్లలోనే పూర్తిచేశారని, ఆ పనుల్లో నాణ్యత పాటించారా? లేదా? అనేది ఎలా పరిశీలించారని కమిటీ నిలదీసింది. నాణ్యత పాటించారని.. పరీక్షల అనంతరమే సంతకాలు చేశామని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు బదులిచ్చారు.

Updated Date - Mar 22 , 2024 | 05:24 AM