Share News

ఈ గడ్డతో ప్రత్యేక అనుబంధం

ABN , Publish Date - May 12 , 2024 | 12:05 AM

ఈ గడ్డతో ప్రత్యేక అనుబంధం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి రంజిత్‌రెడ్డికి మద్దతుగా శనివారం తాండూరు విలియంమూన్‌ మైదానంలో జరిగిన కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభలో ఆమె ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ గడ్డతో  ప్రత్యేక అనుబంధం

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించండి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ

రాష్ట్రంలో కీలకమైన సీఎం, స్పీకర్‌ పదవులు జిల్లాకే దక్కాయి

కందులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

ఎంఎంటీఎస్‌ వికారాబాద్‌ వరకు పొడిగింపు..

గత పాలకులు వికారాబాద్‌ జిల్లాను కరువు జిల్లాగా మార్చేశారు

తాండూరులో జరిగిన కాంగ్రెస్‌ జనజాతరలో సీఎం రేవంత్‌రెడ్డి

తాండూరు, మే 11 : ఈ గడ్డతో ప్రత్యేక అనుబంధం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి రంజిత్‌రెడ్డికి మద్దతుగా శనివారం తాండూరు విలియంమూన్‌ మైదానంలో జరిగిన కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభలో ఆమె ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంతం ఇందిరాగాంధీకి ప్రేమను పంచిందని ప్రియాంక గాంధీ అన్నారు. అందుకే ఈ ప్రాంతంపై తమకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కాంగ్రె్‌సతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిని ఆదరించాలని కోరారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం, అసెంబ్లీ స్పీకర్‌ వంటి అత్యంత కీలకమైన పదవులు వికారాబాద్‌ జిల్లాకే దక్కాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందన్నారు. అనంతగిరిలో పుట్టిన మూసీ నది నీరు జిల్లాకు ఉపయోగం కాకుండాపోయిందని, గత పాలకులు ఈ విషయమై దృష్టి సారించలేదన్నారు. ఇప్పటికే వికారాబాద్‌ జిల్లాను కరువు జిల్లాగా గత పాలకులు మార్చేశారని ఆయన ఆరోపించారు. వికారాబాద్‌ పట్టణాన్ని శాటిలైట్‌ సిటీగా అభివృద్ధి పరిచే పనులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో అభివృద్ధి అర్ధాంతరంగానిలిచిపోయిందన్నారు. వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌ పొడిగించాలని డిమాండ్‌ చాలా కాలంగా ఉన్నా.. ఇంతవరకూ వికారాబాద్‌ వరకు రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయంలోనే వ చ్చాయన్నారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డి గెలుపొందిన తర్వాత ఎంఎంటీఎస్‌ వికారాబాద్‌ వరకు పొడిగింపుతో పాటు జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ది పరిచే పనులు చేపడతామని ఆయన చెప్పారు. జిల్లా రైతులు అఽధికంగా పండించే కందులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యత సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని అన్నారు.

కాంగ్రెస్‌ సభ విజయవంతం

తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ విజయవంత మైంది. కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రియాంకాగాంధీ సభకు భారీగా ప్రజలు తరలి రావడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఊపు తీసుకువచ్చింది. నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సభ ప్రాంగణం నిండిపోయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రియాంకాగాంధీ రావాల్సి ఉండగా, పార్టీ శ్రేణులు, ప్రజలు సభకు జనం ఉదయం 11 గంటల నుండే రావడం ప్రారంభించారు. ప్రియాంక గాంధీ హెలీ క్యాప్టర్‌లో సభా సల్థానికి 3 గంటలకు చేరుకున్నారు. ఆమె గంటకు పైగా ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి జనం కేరింతలు కొట్టారు. వేదికపై మూడు రంగుల జెండా పెట్టి పాటపైన ప్రియాంకాగాంధీ, రేవంత్‌రెడ్డి నృత్యం చేశారు. సభ విజయవంతం కావడం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఆయన వర్గంలో ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు.

రాముడి పేరు చెప్పి ఓట్లడుగుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి.. (బాక్స్‌ ఐటం వాడుకోవాలి )

చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీరాముడు అందరి దేవుడని, దేవాలయ నిర్మాణానికి స్వయంగా తాను రూ.10 లక్షల విరాళం ఇస్తే, రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయోధ్య రామాలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, కరోనా సమయంలో ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నానని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మారిస్తే ఊరుకోబోమని, పార్లమెంట్‌ హక్కులు కాపాడే పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా అమలు చేస్తామని, వాటిలో ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌కే దక్కిందని చెప్పారు. చెయ్యి గుర్తుకు ఓటేసి చేవెళ్ల అభివృద్ధికి సహకరించాలన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆయన చెప్పారు. అన్ని సర్వేలు తన విజయం ఖాయమని చెబుతున్నాయని, ఎన్నికల్లో తనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మతతత్వపార్టీ కావాలా.. లౌకిక వాద పార్టీ కావాలా?: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌ : మతతత్వ పార్టీ బీజేపీ కావాలా..? లేదా లౌకికవాద పార్టీ కాంగ్రెస్‌ కావాలా అని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రశ్నించారు. శనివారం వికారాబాద్‌ లో కార్నర్‌ మీటింగ్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13న జరుగబోయే ఎన్నికల్లో మన చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్‌ చెప్పిన ఆరు గ్యారెంటీలు అందరికి ఉపయోగపడే పథకాలన్నారు. కోడి గుడ్లలో అవినీతి చేశానని అంటున్నారని గుడ్డును కల్తీ చేసే మోగాడు ఉన్నాడా అని ప్రశ్నించారు. నాకు ఉన్నదాంట్లో కోవిడ్‌ సమయంలో సాయం అందించానని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మండల అద్యక్షుడడు రాజు, నాయకులు లక్ష్మీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:05 AM