Share News

గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక బోర్డు!

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:43 AM

తెలంగాణ నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆయా కార్మికుల కోసం ప్రత్యేకంగా

గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక బోర్డు!

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

సెప్టెంబరు 17లోగా ఏర్పాటు చేస్తాం

ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం

ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు

గల్ఫ్‌ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలో చేరికల జాతర

హస్తం గూటికి వేణుగోపాలాచారి

రాజేశ్వర్‌రావు, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌ సత్తయ్య..

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆయా కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ బోర్డు ఏర్పాటుకు అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 17లోగా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. అలాగే, గల్ఫ్‌ వెళ్లే కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గల్ఫ్‌ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గల్ఫ్‌ కార్మికుల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నారని అన్నారు. వీళ్లలో కొందరు ఏజెంట్ల బారిన పడి, మరికొందరు యజమానుల చేతిలో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం జరుగుతుందని చెప్పారు. అలాగే, గల్ఫ్‌ కార్మికులకు సాయం చేసేందుకు ప్రజాభవన్‌లో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఓ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. అలాగే, ఓ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 17 లోగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఫిలిప్పీన్స్‌ దేశం, కేరళ రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రవాసీ సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి ఒక ముసాయిదాను రూపొందించామని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో విదేశీ మంత్రిత్వ శాఖ వ్యవహారాలను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించిన శేషాద్రి అనే సీనియర్‌ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత గల్ఫ్‌ కార్మిక సంఘాలను ఆహ్వానించి.. పాలసీ డాక్యుమెంట్‌పై అభిప్రాయ సేకరణ చేపట్టి ముందడుగు వేస్తామని చెప్పారు. గల్ఫ్‌ కార్మికులకు న్యాయ సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా ఏజెంట్ల చేతిలో జరిగే మోసాల అడ్డుకట్టపై దృష్టి పెట్టామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రతి ఏజెంటూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద తమ పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, గల్ఫ్‌ వెళ్లే కార్మికులకు వివిధ అంశాలపై ఓ వారం రోజులు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా మాదిరిగా గల్ఫ్‌ కార్మికులకు కూడా బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గల్ఫ్‌ కార్మికుల తరపున పార్లమెంటులో గొంతు వినిపించేందుకు నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రాజ్యాధికార సమితి హర్షం

గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవపై బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ‘బొగ్గుబాయి-ముంబాయి-దుబాయి’’ అంటూ గల్ఫ్‌ వాసులకు తియ్యటి మాటలు చెప్పిన కేసీఆర్‌ పదేళ్ల కాలంలో గల్ఫ్‌ వలస కార్మికులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. గల్ఫ్‌ కార్మికులు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలుగా ఎదిగేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. గల్ఫ్‌ బాధితులను కాపాడేందుకు దుబాయ్‌ కాన్సులేట్‌ సౌజన్యంతో రెస్క్యూ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. అలాగే, బాధిత కుటుంబాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటుచేయాలని కోరారు.

Updated Date - Apr 17 , 2024 | 03:43 AM