Share News

ప్రజాపాలన పై నేడు సమీక్ష

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:33 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం రాష్ట్ర మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రజాపాలన  పై నేడు  సమీక్ష

తదుపరి చర్యలపై మంత్రులు, సీఎస్‌, ప్రత్యేక అధికారులతో చర్చ

ప్రజాపాలన వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న రేవంత్‌

1.25 కోట్ల అర్జీల రాక

మూడో గ్యారెంటీ అమలుకు సన్నాహాలు!

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం రాష్ట్ర మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అనంతరం ప్రజాపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు నియామకమైన ప్రజాపాలన నోడల్‌ అధికారులు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు కొంతమంది అధికారులు పాల్గొననున్నారు.

ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు, ఇతర పథకాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, మునిసిపల్‌ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1,11,46,293 మంది పాల్గొన్నారు. దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. హైదరాబాద్‌ జిల్లాలో 13.7 లక్షల దరఖాస్తులు రాగా, తక్కువగా ములుగు జిల్లాలో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

మరో పథకం అమలు చేసేలా..

ముఖ్యమంత్రి రేవంత్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించబోయే మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్న సందర్భంగా పాలన ఎలా ఉంది, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి చర్చ నడుస్తుందనే అంశాలను సీఎం మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజల భావన ఏమిటని ఆరా తీయడంతో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వంద రోజుల్లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పథకాలు, అలాగే జాబ్‌ క్యాలెండర్‌ సహా పలు కీలక అంశాలపైనా సీఎం మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేయగా.. మరో పథకాన్ని కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. రాజీవ్‌ ఆరోగ్య శ్రీలో సాయాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మూడోదిగా ఏ పథకం అమలు చేయాలో చర్చించనున్నట్టు సమాచారం.

కోమటిరెడ్డికి సీఎం పరామర్శ

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. కోమటిరెడ్డి వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా గత నెలలో ఆయన ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డిశ్చార్జ్‌ అయి.. మళ్లీ డిసెంబరు 31న ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Jan 08 , 2024 | 04:33 AM