Share News

పదేళ్లుగా పూర్తి కాని పంచాయతీ భవనం

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:08 AM

గ్రామంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి మొర పెట్టుకుంటారు.

 పదేళ్లుగా పూర్తి కాని పంచాయతీ భవనం
నిలిచిపోయిన భవన నిర్మాణం

పదేళ్లుగా పూర్తి కాని పంచాయతీ భవనం

పశువుల ఆస్పత్రిలో కార్యాలయ నిర్వహణ

నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం

ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు

నిడమనూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి మొర పెట్టుకుంటారు. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయమే ఓ సమస్యగా మారింది. నిడమనూరు మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సొంత భవనం లేనందున స్థానిక పశువుల ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పదేళ్లుగా భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పశువుల ఆస్పత్రిలో చిన్న ఇరుకు గదుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. కనీసం సర్పంచ్‌, సిబ్బంది, కార్యదర్శులు కూడా కూర్చునేందుకు సరైన స్థలం లేదు. 14 మంది వార్డు సభ్యులు ఉన్న మండల కేంద్రంలోని మేజర్‌ పంచాయతీలో పాలకవర్గం సమావేశం నిర్వహిం చే పరిస్థితి కూడా లేదు. ఇక గ్రామసభ నిర్వహించాల్సి వస్తే అంతే సంగతులు. నిడమనూరు గ్రామ పంచాయతీకి గతంలో సొంత భవనం ఉండేది. భవనం పాతది కావడంతో పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం 2014లో రూ. 16 లక్షల ఈజీఎస్‌ నిధులు కేటాయించింది. నిర్మాణానికి నిధులు సరిపోలేదని, బిల్లులు రాలేదని నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేయడంతో పదేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. ఇంకా తమకు రూ. 3ల క్షల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయించాలని గ్రామస్థులు మొర పెట్టుకున్నా నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో భవనంలో కంపచెట్లు, పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. దీంతో గతి లేక పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలోని స్టోర్‌ రూముల్లో పంచాయతీ కార్యాలయం విధులు నిర్వహిస్తున్నారు. దీంతో విధుల నిర్వహణలో పంచాయతీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే ఆవరణలో రెండు కార్యాలయాలు నిర్వహిస్తుండటంతో ఉభయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టోర్‌ రూములు లేక తమకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నందున పంచాయతీ కార్యాలయానికి నిర్వహిస్తున్న గదులను అప్పగించాలని పశువుల ఆస్పత్రి అధికారులు సైతం కోరుతున్నారు. కానీ నిధులు లేకపోవడంతో పంచాయతీ భవన నిర్మాణం ముందుకు సాగడం లేదు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి తక్షణమే అదనపు నిధులు కేటాయించి పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సొంత భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి

నిడమనూరు మండల కేంద్రంలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదన పు నిధులు కేటాయించాలి. గతంలో కేటాయించి న రూ.16 లక్షల ఈజీఎస్‌ నిధులు సరిపోకపోవడంతో నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

నల్లమోతు వెంకటేశ్వర్లు, నిడమనూరు

ప్రతిపాదనలు పంపాం

నిడమనూరు మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం వాస్తవమే. నిలిచిపోయిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. మండలంలోని మిగతా పంచాయతీల భవనాల నిర్మాణం కోసం కూడా ప్రతిపాదనలు పంపాము.

గుర్రం వెంకటేశం, ఎంపీడీవో

Updated Date - Dec 29 , 2024 | 01:08 AM