Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కదిలిన యంత్రాంగం

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:26 AM

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని భూదాన్‌ బోర్డు భూములను బడా బాబులు కాజేసిన వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందించింది.

కదిలిన యంత్రాంగం

జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో వట్టినాగులపల్లి భూముల సర్వే

అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్‌..

ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడి

తాను కొన్నది భూదాన్‌ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరణకు, రికార్డులకు కుదరని పొంతన

2014లో భూమి రిజిస్ట్రేషన్‌.. 2021లో రికార్డుల్లో నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/నార్సింగ్‌): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని భూదాన్‌ బోర్డు భూములను బడా బాబులు కాజేసిన వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందించింది. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంపై విచారణ మొదలుపెట్టింది. వట్టినాగులపల్లిలోని 29.27 ఎకరాల భూదాన్‌ భూములను పెద్దలు చెరబట్టిన వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో.. దీనిపై జిల్లా కలెక్టర్‌ శశాంక విచారణకు ఆదేశించారు. వట్టినాగులపల్లిలోని మొత్తం భూదాన్‌ భూములపై విచారణ జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ఆదివారం గండిపేట తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం ఈ భూములను పరిశీలించి సర్వే నిర్వహించారు.

డ్రోన్‌ సర్వే ద్వారా నిర్మాణాలు, భూముల సరిహద్దులు, ఎవరెవరు ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు? ఎంత భాగం ఇందులో భూదాన భూములున్నాయి? వంటి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సర్వే నంబర్లపై విచారణ జరుపుతున్నామని, అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ భూముల్లో పాగా వేసిన మరికొంత మంది పెద్దల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ధరణి వచ్చిన తరువాత పెద్దలంతా అధికార అండతో ఈ భూములను సొంతం చేసుకున్నట్లు వెల్లడవుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో.. భూదాన్‌ భూములను కొనుగోలు చేసిన వారంతా లోలోన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా భూదాన భూముల వ్యవహారంలో సీరియ్‌సగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై లోతైన విచారణ జరపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం.

పహాణీల్లో పల్లా పేరు ఎక్కడ?

వట్టినాగుపల్లిలో భూమికి సంబంధించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇచ్చిన వివరణకు, రికార్డుల్లో ఉన్న వివరాలకు పొంతన కుదరడంలేదు. తాను 2014లో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతున్నా.. రెవెన్యూ రికార్డుల్లో 2021 వరకు ఎందుకు నమోదు కాలేదనే విషయానికి మాత్రం సమాధానం లేదు. ఈ సర్వే నంబర్లు సబ్‌డివిజన్‌ కాలేదని, ఎంజాయిమెంట్‌ సర్వే జరగలేదనే కారణంగా అప్పటి అఽధికారులెవరూ ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌ జరిగిన భూములను పహాణీలో నమోదు చేయలేదు. రాజేశ్వర్‌రెడ్డితోపాటు అనేక మంది భూముల వివరాలు కూడా రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాతే వీరందరికీ పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. విచిత్రమేమిటంటే.. 2021 జూన్‌ 10వ తేదీన అప్పటి కలెక్టర్‌ ఈ 29.27 ఎకరాల భూదాన భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టగా, అదే ఏడాది ఆగస్టు 24వ తేదీన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సర్వే నంబరు 188/1/2 పేరుతో పట్టాదారు పాస్‌బుక్‌ జారీ అయింది. ఆయనతోపాటు మిగతా వారికి పాస్‌బుక్‌ జారీ చేయడం వెనుక పెద్ద తతంగమే నడిపారు. ఏడీ సర్వే ల్యాండ్‌ రికార్డు స్కెచ్‌, భూదాన బోర్డు స్కెచ్‌ కూడా చూపించి ధరణి ద్వారా పాస్‌బుక్‌లు జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో స్థానిక తహసీల్దార్‌, మండల సర్వే అధికారుల నివేదిక తీసుకుంటారు. కానీ, ఇక్కడ నేరుగా ఏడీ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఇచ్చిన స్కెచ్‌, భూదాన బోర్డు ఇచ్చిన స్కెచ్‌ ఆధారంగా పాస్‌బుక్‌లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే అప్పటి వరకు అసలు సబ్‌డివిజన్‌, ఎంజాయ్‌మెంట్‌ సర్వే జరిగినట్లు ఆధారాలు కూడా లేకపోవడం వల్లే రెవెన్యూ అధికారులు పాస్‌బుక్‌లు నిలిపివేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ 22ఏ జాబితాలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. పైగా.. వీరు చూపిస్తున్న భూదాన బోర్డు స్కెచ్‌లో ఎక్కడా సంతకం గానీ, తేదీ గానీ, కనీసం స్టాంప్‌ గానీ లేకపోవడం గమనార్హం.

నేను కొన్నది భూదాన భూమి కాదు: ఎమ్మెల్యే పల్లా

వట్టినాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, వాటిని ఖండిస్తున్నానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తనకు అక్కడ ఉన్నది కేవలం 1.10 ఎకరాలు మాత్రమేనని, ఇది కూడా భూదాన భూమి కాదని చెప్పారు. తాను వట్టినాగులపల్లి సర్వే నంబరు 181/1/2లో భూమి కొనుగోలుకుకు ఒప్పందం కుదర్చుకున్నానని, దీనిపై న్యాయసలహాలు కూడా తీసుకుని 2014లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో కూడా పొందుపరిచానని తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, ఏడీ సర్వే ల్యాండ్‌ రికార్డు స్కెచ్‌, భూదాన బోర్డు స్కెచ్‌ కూడా ఉన్నాయని చెప్పారు. వీటిని ఎవరైనా పరిశీలించుకోవచ్చన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 04:26 AM