Share News

వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య!

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:29 AM

తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, తన కూతురు మీదే కన్నేసి, వేధించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.

వివాహేతర సంబంధంతో  వ్యక్తి దారుణ హత్య!

వదినతో సంబంధం ..ఆమె కూతురుపైనా కన్నేసిన వ్యక్తి

అడ్డుతొలగించుకోవాలని ఆ తల్లీకూతుళ్ల స్కెచ్‌

కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేసిన వైనం

హైదరాబాద్‌ సిటీ/ఉప్పల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, తన కూతురు మీదే కన్నేసి, వేధించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. కూతురుతో కలిసి అతడి హత్యకు పథకం వేసింది. కత్తులతో దాడి చేయించి చంపించింది. ఉప్పల్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం పుస్తకాల సాయి కుమార్‌ (43) అనే సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడికి వరుసకు వదిన అయ్యే పుస్తకాల శారద (40) అనే మహిళ, ఆమె కూతురు శివానీ (23) కలిసి ఈ హత్య చేశారని.. ఇందుకు వీరికి పుస్తకాల దీపక్‌ కుమార్‌ (42), యల్లా బాలకృష్ణ (35) అనే ఇద్దరు పాత నేరస్తులు సహకరించారని తేల్చారు. కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ పీ.వి.పద్మజ వెల్లడించారు. రవీంద్రనగర్‌లో నివసించే శారదకు భర్త చనిపోయాడు. కూతురు శివానీతో కలిసి ఉంటోంది. కొన్నాళ్లుగా శారద, సాయికుమార్‌ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. శారదతో సంబంధం సాగిస్తూనే ఆమె కూతురు శివానీపై సాయికుమార్‌ కన్నేసి.. లైంగికంగా వేధిస్తున్నాడు.

ఇది తెలిసి.. సాయికుమార్‌ నుంచి కుమార్తెను రఽక్షించుకునేందుకు అతడిని అడ్డు తొలగించుకోవాలని శారద నిర్ణయించింది. దీపక్‌ అనే వ్యక్తి సాయి కుమార్‌కు వరుసకు సోదరుడవుతాడు. దీపక్‌ తన భార్య హత్య కేసులో కొన్నాళ్లు జైల్లో ఉన్నాడు. సాయి కుమార్‌కు సంబంధించి విషయమంతా దీపక్‌కు చెప్పి.. హత్యకు సహకరించాలని కోరింది. దీపక్‌ వెంటనే సరేనన్నాడు. ఈ విషయాన్ని దీపక్‌.. ఉప్పల్‌ పరిధిలో జరిగిన జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న బాలకృష్ణకు చెప్పి సహకరించేందుకు మాట తీసుకున్నాడు. నలుగురూ కలిసి సాయికుమార్‌ హత్యకు పథకం వేశారు. ఈనెల 21న శారద, శివాని.. సాయికి ఫోన్‌ చేసి వెలుగు గుట్ట సమీపంలోకి రావాలని చెప్పి పిలిపించుకున్నారు. తాము చెప్పిన చోటుకు సాయి రాగానే అతడిని శారద మాటల్లో పెట్టింది. అదును చూసి శివాని అతడి కళ్లలో కారం చల్లింది. అప్పటికే అక్కడ మాటువేసిన దీపక్‌, బాలకృష్ణ కలిసి కత్తులతో సాయి మెడ, తల, పొట్ట మీద కత్తులతో పొడిచారు. రక్తపు మడుగులో ఉన్న సాయికుమార్‌ను ఆర్‌జీఐ క్రికెట్‌ స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది గమనించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి సోదరుడు సాయికిరణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శారద, శివాని, దీపక్‌, బాలకృష్ణ కలిసి హత్యచేశారని నిర్ధారించిన పోలీసులు.. ఆ నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 25 , 2024 | 10:47 AM