Hitech Thieves: ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చాడు.. తీరా చూస్తే ఏమైందంటే?
ABN , Publish Date - Jan 29 , 2024 | 08:49 PM
అతడు ఒక నిరుద్యోగి. స్థానికంగా ఎలాంటి పని దొరక్కపోవడంతో.. హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఇక్కడ ఏదైనా ఒక కోర్సు నేర్చుకొని, మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాడు. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలన్న ఉద్దేశంతో.. కొన్నాళ్లు బాగానే కష్టపడ్డాడు. కానీ.. ఇంతలోనే అతడ్ని ఆర్థిక ఇబ్బందులు కమ్మేశాయి.
అతడు ఒక నిరుద్యోగి. స్థానికంగా ఎలాంటి పని దొరక్కపోవడంతో.. హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఇక్కడ ఏదైనా ఒక కోర్సు నేర్చుకొని, మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాడు. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలన్న ఉద్దేశంతో.. కొన్నాళ్లు బాగానే కష్టపడ్డాడు. కానీ.. ఇంతలోనే అతడ్ని ఆర్థిక ఇబ్బందులు కమ్మేశాయి. అటు.. కుటుంబ సభ్యుల నుంచి సరైన ఆర్థిక సహాయం అందలేదు. చివరికి పూట గడవడం కూడా కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను అనుకున్నట్టుగా జీవితం నడవకపోవడంతో.. అక్రమ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. దొంగగా అవతారం ఎత్తి.. జనాల జేబులకు చిల్లులు వేయడం మొదలుపెట్టాడు.
మొదట్లో తాను చేసిన ప్రయత్నాల్లో విజయవంతం అవ్వడం.. ఆ డబ్బులతో కోరుకున్నవన్నీ లభించడంతో.. అతడు తన సాఫ్ట్‌వేర్ కలని పక్కన పెట్టేశాడు. దొంగగానే చెలామణి అవుదామని ఫిక్స్ అయ్యాడు. అయితే.. తానొక్కడి వల్లే దొంగతనాలు సాధ్యం కావని తెలుసుకొని, తన సోదరుడ్ని కూడా దొంగగా మార్చేశాడు. ఉద్యోగాల్లో రానంత డబ్బు.. జేబులు కొట్టేసి సాధించొచ్చని తమ్ముడ్ని రెచ్చగొట్టాడు. అలా వీళ్లిద్దరు దొంగగా మారి.. అల్వాల్ పంచశీల్ కాలనీలో ఒక ఇంటిని టార్గెట్ చేశారు. ఎవరూ లేని సమయం చూసి.. ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. భారీ నగదుతో పాటు నగలు దోచుకుని.. అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలించిన ఆ డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టారు. తమని ఎవరూ పట్టుకోరన్న భ్రమలో ఉండిపోయారు. కానీ.. ఇంతలోనే ఆ ఇద్దరు దొంగలకు పోలీసులు షాకిచ్చారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలని రంగంలోకి దిగారు. తొలుత ఆ ఇద్దరు దొంగలెవరో గుర్తించిన పోలీసులు.. వాళ్లు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? అనే వివరాలను రాబట్టారు. ఫైనల్‌గా పక్కా స్కెచ్ వేసి.. ఆ ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగదుతో పాటు బందారం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ.. అడ్డదారి ఎంపిక చేసుకొని, ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.