Share News

నచ్చక ఉద్యోగం మానేస్తే కిడ్నాప్‌ చేసి వైర్లతో కొట్టారు!

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:03 AM

అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి మొత్తంగా ఏడుగురున్నారు. అంతా కలిసి ప్రజావాణికొచ్చారు. ఉద్యోగం నచ్చక కొన్నిరోజుల క్రితం మానేస్తే కక్ష కట్టిన యాజమాన్యం తమను అపహరించి.. ఓ షెడ్డులో

నచ్చక ఉద్యోగం మానేస్తే  కిడ్నాప్‌ చేసి వైర్లతో కొట్టారు!

లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌ యాజమాని దాష్టీకంపై.. ప్రజావాణికొచ్చి గోడు చెప్పుకొన్న బాధితులు

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన

శుక్రవారం 1,364 దరఖాస్తులు.. విభాగాల వారీగా స్వీకరణ

బేగంపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): బంధించి.. తాళ్లు, గ్యాస్‌ పైపులు, వైర్లతో విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. తమను కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ అంతా వీడియో తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌’ యజమాని కొప్పుల హరిదీ్‌పరెడ్డే ఇదంతా చేశారని ఆరోపిస్తూ ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఏడుగురు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. యువకులను చొక్కాలు విపించి తాళ్లు, వైర్లతో కొడుతూ వీడియో తీసి బెదిరించాడని, యువతులను పలు చోట్ల చిత్ర హింసలకు గురి చేశాడని బాధితులు చెప్పుకొని బాధపడ్డారు. సోషల్‌ మీడియాలో కిడ్నాప్‌ విషయం బయటకు రావడంతో వదిలేశారని, లేదంటే తమను చంపేసేవారని కన్నీటిపర్యంతమయ్యారు. యువకులంతా తమ వీపులపై పడిన దెబ్బల తాలూకు వాతలను చూపించారు. అంతా సావధానంగా విన్న నోడల్‌ అధికారి దివ్యా దేవరాజన్‌, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా శుక్రవారం పలు సమస్యలపై 1364 దరఖాస్తులొచ్చాయి. శాఖల వారీగా ప్రజల నుంచి అర్జీలను తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు డబుల్‌ బెడ్‌రూం, రెవెన్యూ, పౌరసరఫరాలు, ఉపాది, ఆరోగ్యశ్రీ, విద్యాశాఖ, సంక్షేమం, మహిళా శిశు, వ్యవసాయం, పరిశ్రమలు, పెన్షన్‌ సహా మొత్తంగా 13 విభాగాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అక్కడ ప్రత్యేక బోర్డులు పెట్టారు. నియామక పత్రాలు రాని కానిస్టేబుల్‌ అభ్యర్ధుల నుంచి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ధరణి, పెన్షన్లు, ఆరోగ్య సమస్యలకు సంబందించి దరఖాస్తులొచ్చినట్లు అధికారులు చెప్పారు.

460 ఎకరాల్లో ప్లాట్ల కబ్జాపై

ప్రధానంగా గండిపేట మండల, వట్టినాగుల పల్లిలోని శంకరహిల్స్‌లో 1983లో వేసిన వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్లు, ఈసీ తమ పేరుమీద ఉన్నాయని, అయితే ధరణిలో కొందరు భూకబ్జాదారులు గత ప్రభుత్వం పెద్దలతో కుమ్మకై రాత్రి పూట ధరణి ఓపెన్‌ చేసి ఇక్కడ ఉన్న 460 ఎకరాల్లోని తమ ప్లాట్లను మార్చుకున్నారని బాధితులు ఆరోపించారు. ధరణి రాత్రి పూట ఓపెన్‌ అవుతుందని... పగలు కనిపంచడం లేదంటూ ఈ విషయంపై గత ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 19 ఎకరాలు ఉన్న యాప్రాల్‌ చెరువు... ప్రస్తుతం ఎనిమిదెకరాలకు ఎకరాలకు చేరిందని, ఇక్కడ ఓ మాజీ మంత్రి అండతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించారని, దీనితో పాటు పలు గొలుసుకట్టు చెరువులు కబ్జాకు గురయ్యాయని యాప్రాల్‌ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు పరిరక్షణ కోసం యాప్రాల్‌ జేఏసీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఇటీవల కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు నియామక పత్రాలు ఇచ్చారని, అయితే 15,441 మంది అభ్యర్ధులకు గాను 13,400 మందికి మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారని, మిగిలిన 2వేల మందికి నియామక పత్రాలు ఇవ్వలేదంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్ధులు ప్రజావాణిలో విన తి పత్రాలు సమర్పించారు.

Updated Date - Feb 17 , 2024 | 04:03 AM